ఎవరినీ బాధపెట్టాలని అలా మాట్లాడలేదు.. జగన్ సోదర సమానుడు : మంత్రి కేటీఆర్‌

Minister KTR responds about his comments on Andhra Pradesh.పక్క రాష్ట్రంలో కరెంటు ఉండడం లేదని, రోడ్లు అధ్వానంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 April 2022 3:03 AM GMT
ఎవరినీ బాధపెట్టాలని అలా మాట్లాడలేదు.. జగన్ సోదర సమానుడు : మంత్రి కేటీఆర్‌

పక్క రాష్ట్రంలో కరెంటు ఉండడం లేదని, రోడ్లు అధ్వానంగా ఉన్నాయ‌ని తెలంగాణ మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీనిపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన మంత్రులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాను చేసిన వ్యాఖ్య‌ల‌పై మంత్రి కేటీఆర్ వివ‌ర‌ణ ఇచ్చారు. త‌న వ్యాఖ్య‌ల వెనుక ఎలాంటి దురుద్దేశం లేద‌న్నారు. అన్యాపదేశంగా తన నోటి వెంట వ‌చ్చాయ‌ని అన్నారు. సోద‌ర స‌మానుడైన జ‌గ‌న్ నాయ‌క‌త్వంలో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రం మ‌రింత అభివృద్ధి చెందాల‌ని కోరుకుంటున్నట్లు చెప్పారు.

'క్రెడాయ్ స‌మావేశంలో అన్యాప‌దేశంగా చేసిన వ్యాఖ్య‌లు ఏపీలోని నా స్నేహితుల‌కు తెలియ‌కుండానే కొంత బాధ క‌లిగించి ఉండొచ్చు. ఈ వ్యాఖ్య‌ల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదు, ఎవ‌రినో బాధ పెట్టాల‌నో, కించ‌ప‌ర‌చాల‌నో అలా మాట్లాడ‌లేదు. ఏపీ సీఎం జ‌గ‌న్‌ను సోద‌ర స‌మానుడిగా భావిస్తున్నా.. ఆయ‌న నాయ‌క‌త్వంలో ఆ రాష్ట్రం మ‌రింత అభివృద్ధి చెందాల‌ని మ‌న‌సారా కోరుకుంటున్నా' అని మంత్రి కేటీఆర్ శుక్ర‌వారం అర్థ‌రాత్రి ట్వీట్ చేశారు.

క్రెడాయ్ స‌మావేశంలో మంత్రి కేటీఆర్ ఎమ‌న్నారంటే.. 'నా స్నేహితుడు ఒకాయ‌న సంక్రాంతికి ప‌క్క రాష్ట్రానికి వెళ్లారు. అక్క‌డ ఆయ‌న‌కు తోట‌లు, ఇళ్లు ఉన్నాయి. వెళ్లొచ్చాక నాకు ఫోన్ చేశారు. అక్క‌డ నాలుగు రోజులు ఉంటే క‌రెంట్ లేదు. నీళ్లు లేవు. రోడ్లు ధ్వంస‌మై ఉన్నాయి. తిరిగ‌డానికి లేద‌ని, చాలా న‌ర‌కంలో ఉన్నామ‌ని, హైద‌రాబాద్ వచ్చాకే ఊపిరి పీల్చుకున్న‌ట్లుగా ఉంది. ద‌య‌చేసి మ‌న‌వాళ్లంద‌ర్నీ అక్క‌డికి ఒక‌సారి పంపిండి. అప్పుడే మ‌న విలువ ఏంటో.. మ‌న ప్ర‌భుత్వం చేస్తున్న‌దేంటో తెలిసి వ‌స్తుందన్నారు. నేను చెబుతున్న‌ది అతిశ‌యోక్తి అనిపిస్తే.. సొంత డ‌బ్బా కొట్టుకోవ‌డానికి ఎక్కువ చెబుతున్నా అనుకుంటే.. కారు తీసుకుని ప‌క్క రాష్ట్రానికి వెళ్లి రండి. కొన్ని మాట‌లు కొంద‌రికి న‌చ్చ‌క‌పోవ‌చ్చు కానీ ఇవి వాస్త‌వాలు' అని మంత్రి కేటీఆర్ అన్నారు.

Next Story