తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇప్పటికే పలు సందర్భాల్లో ఆరోపణలు చేయగా.. తాజాగా మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. 'మోదీ జీ మీరు గుజరాత్‌కే కాదు.. భారత్‌కు కూడా ప్రధానే' అని ట్వీట్ చేశారు. ఎనిమిదేళ్లుగా రాష్ట్రానికి ఒక్క వైద్యకళాశాల కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. కేంద్రం చర్యతో వైద్యవిద్యకు దూరమయ్యే యువత పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణపై ఇంత వివక్ష ఎందుకు ని సోషల్‌మీడియా వేదికగా నిలదీశారు.
గుజరాత్‌కు చెందిన కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో గురువారంమాట్లాడిన సందర్భంగా మోదీ కాస్తంత ఎమోషనల్ అయ్యారు. తన కూతురు వైద్య విద్య అభ్యసించలేకపోయిందంటూ గుజరాత్‌కు చెందిన అయూబ్ పటేల్ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేయగా.. ప్రధాని ఎమోషనల్ అయ్యారు. ఈ విషయంపై తాను దృష్టి సారిస్తానని, మీ కుమార్తె వైద్య విద్య అభ్యసించేందుకు ఏమైనా సాయం చేయగలమేమో పరిశీలిస్తామని ఈ సందర్భంగా మోదీ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రాగానే దాని ఆధారంగానే మోదీని టార్గెట్ చేస్తూ కేటీఆర్ విమర్శలు చేశారు.