బండి సంజ‌య్ వ్యాఖ్య‌ల‌పై ఘాటుగా స్పందించిన కేటీఆర్.. 'ఓ వైపు విశ్వ గురు అలా చెబుతుంటే..'

Minister KTR counter to Bandi Sanjay Comments.తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే అర్హులంద‌రికీ ఉచితంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Sep 2022 7:39 AM GMT
బండి సంజ‌య్ వ్యాఖ్య‌ల‌పై ఘాటుగా స్పందించిన కేటీఆర్.. ఓ వైపు విశ్వ గురు అలా చెబుతుంటే..

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే అర్హులంద‌రికీ ఉచితంగా.. విద్యుత్‌, ప‌క్కా ఇళ్లు, వైద్యం అందిస్తామ‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియా వేదిక‌గా మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. బీజేపీ మూర్ఖ‌త్వం చూస్తుంటే విచిత్రంగా ఉంద‌ని విమ‌ర్శించారు.

'ఉచితాలు వద్దని ఓ వైపు విశ్వ గురు (ప్రధాని మోదీ) అంటుండ‌గా.. మరోవైపు ఈ ఎంపీ ఉచితంగా విద్య, ఆరోగ్యం, ఇళ్లు ఇస్తామని హామి ఇస్తారు. కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీనే క‌దా..? మ‌రి దేశంలోని పేద‌ల‌కు పేదలకు ఉచితంగా ఇళ్లు, విద్య, వైద్యం అందించకుండా ఎవరు మిమ్మల్ని ఆపుతున్నారు?' అని మంత్రి కేటీఆర్ ప్ర‌శ్నించారు.

తెలంగాణలో బీజేపీ ఇస్తున్న ఉచిత హామీలపై పార్లమెంటులో చట్టం చేయాలని ప్రధాని మోదీని డిమాండ్‌ చేశారు. దేశంలోని 28 రాష్ట్రాల్లో ఉన్న పేదలకు విద్య, వైద్యం, ఇళ్లు ఉచితంగా ఇచ్చేలా చట్టాన్ని తీసుకొస్తే టీఆర్‌ఎస్‌ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

బుధ‌వారం బండి సంజ‌య్ ప్ర‌జా సంగ్రామ యాత్ర కేపీహెచ్‌బీ కాల‌నీ నుంచి బాలాన‌గ‌ర్ వ‌ర‌కు కొన‌సాగింది. మూసాపేట‌లో ఏర్పాటు చేసిన స‌భ‌లో సంజ‌య్ మాట్లాడుతూ.. ఇత‌ర రాష్ట్రాల నుంచి పొట్ట‌కూటి కోసం న‌గ‌రానికి వ‌చ్చి స్థిర‌ప‌డిన వారంద‌రికీ త‌మ ప్ర‌భుత్వం వ‌చ్చాక ఇళ్లు క‌ట్టిస్తామ‌ని హామీ ఇచ్చారు. మ‌ద్యం, ఇసుక‌, భూములు, డ్ర‌గ్స్ స‌హా అన్ని కుంభ‌కోణాల్లోనూ సీఎం కుటుంబ భాగ‌స్వామ్యం ఉంద‌ని ఆరోపించారు. తెలంగాణలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు సైతం సరిగా చేయడం లేదని విమ‌ర్శ‌లు గుప్పించారు.

కాగా.. కొద్ది రోజులు క్రితం ఉచితాలు వ‌ద్దంటూ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే.

Next Story