బండి సంజ‌య్‌కి కేటీఆర్ స‌వాల్.. ద‌మ్ముంటే గంగుల మీద పోటీ చేసి గెలువు

Minister KTR challenged to Bandi Sanjay.ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం క‌రీంన‌గ‌ర్ జిల్లాలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 March 2022 10:54 AM GMT
బండి సంజ‌య్‌కి కేటీఆర్ స‌వాల్.. ద‌మ్ముంటే గంగుల మీద పోటీ చేసి గెలువు

ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. తిమ్మాపూర్ మండ‌లంలోని రేణికుంట‌లో టీఆర్ఎస్ కార్య‌క‌ర్త కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. మృతి చెందిన టీఆర్ఎస్ కార్య‌క‌ర్త కుటుంబానికి రూ.2ల‌క్ష‌ల చెక్కు అందించారు. అనంత‌రం క‌రీంన‌గ‌ర్ కార్పొరేష‌న్ ప‌రిధిలో రూ.410 కోట్ల‌తో చేప‌ట్టే మానేరు రివ‌ర్ ఫ్రంట్ ప‌నుల‌కు, న‌గ‌రంలో ప్ర‌తి రోజు మంచి నీటి స‌ర‌ఫ‌రా ప‌థ‌కానికి సంబంధించిన మిష‌న్ భ‌గీర‌థ పైలాన్ ను ఆవిష్క‌రించారు.

అనంత‌రం ఏర్పాటు చేసిన స‌భ‌లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ క‌రీంన‌గ‌ర్ జిల్లాను ల‌క్ష్మీన‌గ‌రంగా బావిస్తార‌న్నారు. అందుక‌నే ఏ సంక్షేమ ప‌థ‌కం మొద‌లు పెట్టిన ఇక్క‌డ నుంచే ప్రారంభిస్తార‌ని చెప్పారు. తెలంగాణ ఉద్య‌మానికి క‌రీంన‌గ‌ర్‌లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ నుంచే శంఖారావం పూరించార‌న్నారు. తెలంగాణ వ‌చ్చింది. అభివృద్ధి ప‌థంలో దూసుకుపోతోందని తెలిపారు. తెలంగాణ రాక‌ముందు రూ. 200 పెన్ష‌న్ ఉంద‌ని దాన్ని ప‌ది రెట్లు పెంచి ఇప్పుడు ఆస‌రా పెన్ష‌న్ల కింద రూ. 2016లు ఇస్తున్న‌ట్లు చెప్పారు. బీడీ కార్మికుల‌కు పెన్ష‌న్లు ఇస్తున్న ఏకైక ప్ర‌భుత్వం తెలంగాణ‌నేన‌ని అన్నారు. భ‌ర్త‌ల చేత నిరాద‌ర‌ణ‌కు గురైన మ‌హిళ‌ల‌కు సైతం పెన్ష‌న్లు ఇస్తున్న‌ట్లు తెలిపారు. దివ్యాంగుల‌కు రూ. 3,016 ఇస్తున్నాం. కులం, మ‌తంతో సంబంధం లేకుండా 18 ఏండ్లు నిండిన అమ్మాయిల‌కు క‌ల్యాణ‌లక్ష్మి, షాదీముబార‌క్ ప‌థ‌కాలు అమ‌లు చేసి ల‌క్షా నూట ప‌ద‌హారులు ఇస్తున్నామ‌ని కేటీఆర్ గుర్తు చేశారు.

క‌రీంన‌గ‌ర్ ఎంపీ ఉన్న‌ప్పుడు వినోద్ కుమార్ న‌గ‌రానికి స్మార్ట్ సిటీ హోదా తీసుకువ‌చ్చార‌ని.. మ‌రి ఇప్పుడు గెలిచిన బండి సంజ‌య్ క‌నీసం రూ.3 కోట్ల నిధులు తెచ్చాడా అని విమ‌ర్శించారు. కేంద్రం వల్ల తెలంగాణకు ఏమైనా ఒరిగిందా..? కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం బండి సంజయ్ ఏనాడైనా కేంద్రాన్ని అడిగాడా అని మంత్రి ప్రశ్నించారు. క‌రీంన‌గ‌ర్ యువ‌త కోసం ఏం చేసిన‌వ్‌..? ఉద‌యం లేచింది మొద‌లు హిందూ, ముస్లిం పంచాయ‌తీ త‌ప్ప సంజ‌య్‌కు ఏమీ రాద‌ని వ్యాఖ్యానించారు. క‌రీంన‌గ‌ర్‌కు క‌నీసం ఓ గుడి అయినా తెచ్చావా..? మంత్రి గంగుల క‌మలాక‌ర్ వేంక‌టేశ్వ‌ర స్వామి గుడి తీసుకువ‌చ్చార‌న్నారు. కేంద్రం త‌రుపున క‌రీంన‌గ‌ర్ జిల్లాకు ఏమి చేసిండో బండి సంజ‌య్‌కే తెలియాల‌ని ఎద్దేవా చేశారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కి సవాల్ విసురుతున్నా.. దమ్ముంటే గంగుల కమలాకర్ మీద మళ్ళా పోటీ చేసి గెలువు.. గంగుల కమలాకర్ మళ్లీ లక్ష మెజారిటీతో గెలవడం ఖాయమని మంత్రి కేటీఆర్ ధీమా వ్య‌క్తం చేశారు.

Next Story