Kakani Govardhan Reddy : పవన్ కల్యాణ్ స్థాయి తోలు బొమ్మలాటలో జోకర్ మాత్రమే : మంత్రి కాకాణి
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు
By తోట వంశీ కుమార్ Published on 1 March 2023 3:08 PM IST
పవన్ కల్యాణ్‌పై మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీని గానీ, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను గానీ తాము అసలు గుర్తించడం లేదని మంత్రి స్పష్టం చేశారు. నిబద్ధత లేని వ్యక్తి గురించి, ఆ పార్టీ గురించి గానీ మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. పవన్ కల్యాణ్ స్థాయి తోలుబొమ్మలాటలో జోకర్ మాత్రమే అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల్లో 175 నియోజక వర్గాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఇతర పార్టీలతో పొత్తులు మాకు అవసరం లేదన్నారు. ఒంటరిగా 175 చోట్ల పోటీ చేసే దమ్ము టీడీపీకి ఉందా అని ప్రశ్నించారు. సవాల్‌కు సమాధానం చెప్పలేక ఆ పార్టీ నేతలు ముఖం చాటేస్తున్నారన్న మంత్రి.. సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల్లోకి వెళ్లి మద్దతు ఇమ్మని అడుతున్నట్లు చెప్పారు.
యువగళం పాదయాత్రకు జనాదరణ లేదని చెప్పారు. వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ ఆర్థిక సాయంతో పాటు, మాందోస్ తుపాను పంట నష్ట పరిహారం చెల్లించామన్నారు. వైసీపీ పార్టీ నమ్ముకుంది ప్రజలను మాత్రమేనని మంత్రి తెలిపారు. ఇతర పార్టీలతో పొత్తులు తమకు అవసరం లేదని స్పష్టం చేశారు. ప్యాకేజీలు చెల్లిస్తే కలిసే పార్టీ వైసీపీ కాదన్నారు.
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అని, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అని వేరువేరుగా ఉండవన్నారు. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లతో కలిసే రాష్ట్ర బడ్జెట్ ఉంటుందని చెప్పారు. 2014కు ముందు చంద్రబాబు రుణమాఫీ చేస్తామని ఎన్నికలకు వెళ్లారన్నారు. పీఎం కిసాన్‌తో కలిసి రైతు భరోసా ఇస్తామని పదేపదే వైసీపీ ప్రభుత్వం చెబుతోందన్నారు. రైతులకు సీజన్‌కు ముందుగానే నీళ్ళు ఇచ్చామన్నారు. సాగునీటి ప్రాజెక్టులు కడితే వ్యయం తప్ప ఏమీ ఉండదని చంద్రబాబు అన్నారని గుర్తుచేశారు. నెల్లూరు లాంటి చోట సంగం బ్యారేజిని తమ ప్రభుత్వం నిర్మించిందని తెలిపారు.
ఇక సీఎం తెనాలికి హెలికాఫ్టర్‌లో వెళ్లే విషయాన్పి కూడా ప్రతిపక్షాలు నిర్దేశిస్తాయా అంటూ మంత్రి మండిపడ్డారు.