60 ఏళ్లలో ఏమీ చేయలేదు..కాంగ్రెస్‌ను ఇప్పుడెలా నమ్ముతారు?: హరీశ్‌రావు

తెలంగాణలో బీఆర్ఎస్‌ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

By Srikanth Gundamalla  Published on  16 Sep 2023 7:35 AM GMT
Minister Harish Rao,  Congress, Telangana, BRS,

60 ఏళ్లలో ఏమీ చేయలేదు..కాంగ్రెస్‌ను ఇప్పుడెలా నమ్ముతారు?: హరీశ్‌రావు

తెలంగాణలో బీఆర్ఎస్‌ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. నిరంతరాయంగా వ్యవసాయానికి 24 గంటల పాటు నాణ్యమైన కరెంటు అందిస్తోన్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అన్నారు. గతంలో 60 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని విమర్శించారు.. అలాంటి ఇప్పుడెలా ఆ పార్టీని నమ్ముతారని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో బీసీ బంధు, మైనార్టీ బంధు లబ్ధిదారులకు మంత్రి హరీశ్‌ రావు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధి పండుగ కొనసాగుతోందని చెప్పారు. సెప్టెంబర్ 15న ఒక్కరోజే 9 మెడికల్‌ కాలేజ్‌లు ప్రారంభించుకున్నామని అన్నారు. ఎలాంటి షరతులు లేకుండా బీసీ బంధు కింద లబ్ధిదారులకు నేరుగా రూ.లక్ష అందిస్తున్న సీఎం కేసీఆర్‌కు ఈ సందర్భంగా హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని వర్గాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లు, జూనియర్ కాలేజ్‌లు, డిగ్రీ కాలేజ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని హరీశ్‌రావు అన్నారు.

హిందువులైనా ముస్లింలైనా అందరికోసం పనిచేసే ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కార్‌ అని హరీశ్‌రావు వెల్లడించారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలా పేదింటి ఆడబిడ్డ పెండ్లికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ తరహా పథకాలు ఏ రాష్ట్రంలోనూ లేవని చెప్పారు. ఎన్నికలు వస్తున్న వేళ కాంగ్రెస్‌ నాయకులు అమలుకు వీలు కానీ హామీలు ఇస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. 60 పాలనలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని.. ఇప్పుడేదో చేస్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఆకలైనప్పుడు అన్నం పెట్టని చేతకాని కాంగ్రెస్‌కు.. అవసరానికి గోరుముద్దలు తినిపిస్తామంటే ప్రజలు నమ్మరన్నారు. అయితే.. కాంగ్రెస్‌ ప్రస్తుతం అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో తెలంగాణకు మించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసి చూపించాలని సవాల్‌ విసిరారు మంత్రి హరీశ్‌రావు.

Next Story