పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేశారని అన్నారు. బుధవారం ఆమె అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో సంస్థ నాలుగైదేళ్ల క్రితం పెగాసస్ స్పైవేర్‌ను తమకు అమ్మేందుకు బెంగాల్ వచ్చిందన్నారు. రూ.25 కోట్లకు విక్రయిస్తామని బెంగాల్ బెంగాల్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను సంప్రదించిందన్నారు. అయితే.. రాష్ట్ర ప్రయోజనాలకు ఆమోదం కానందున ఆ సంస్థ ఆఫర్‌ను తాము తిరస్కరించామన్నారు. అయితే.. చంద్రబాబు నాయుడు హయాంలో ఏపీ ప్రభుత్వం ఈ స్పైవేర్‌ను కొనుగోలు చేసిందని మమత వెల్లడించారు.
కాగా.. మమత చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ(టీడీపీ) స్పందించింది. ఆమె చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేసింది. చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. పెగాసస్ కొనుగోలు చేసినట్లు వచ్చిన వార్తలను ఖండించారు. అప్పట్లో తమకు కూడా పెగాసస్ క్రియేట్ చేసిన వారి నుంచి ఆఫర్ వచ్చిందని కానీ తాము తిరస్కరించినట్లు చెప్పారు. చట్టానికి విరుద్ధంగా తాము ఎలాంటి పనులు చేయమన్నారు. ఆమెకు(మమతా బెనర్జీకి) ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారని.. దాని ఆధారంగా అలా ఆమె అని ఉండొచ్చునని లోకేష్ అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉంటే.. చంద్రబాబుపై పెగాసస్ ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. ఆయన నిజంగానే కొనుగోలు చేశారా అనే దానిపై చర్చ జరుగుతోంది.