కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఖర్గే ప్రమాణ స్వీకారం

Mallikarjun Kharge takes charge as Congress president.కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడిగా మ‌ల్లికార్జున ఖ‌ర్గే బాధ్య‌త‌లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Oct 2022 12:52 PM IST
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఖర్గే ప్రమాణ స్వీకారం

కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్య‌క్షుడిగా బుధ‌వారం మ‌ల్లికార్జున ఖ‌ర్గే బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో 98 వ కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా మ‌ల్లికార్జున ఖ‌ర్గే ప్ర‌మాణ స్వీకారం చేశారు. దీంతో 24 సంవ‌త్స‌రాల త‌రువాత పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టిన గాంధీ కుటుంబేత‌ర వ్య‌క్తిగా నిలిచారు. ఇటీవ‌ల జ‌రిగిన పార్టీ అంత‌ర్గ‌త ఎన్నిక‌ల్లో ఖ‌ర్గే సీనియ‌ర్ నేత శ‌శిథ‌రూర్‌పై విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.

ఖ‌ర్గే ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్ స‌హా ఇత‌ర నేత‌లు హాజ‌ర‌య్యారు. అనంత‌రం కొత్త‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఖ‌ర్గేకు.. సోనియా, రాహుల్ పుష్ప‌గుచ్చం ఇచ్చి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ.. ఎంతో అనుభ‌వం ఉన్న నాయ‌కుడు ఖ‌ర్గే అని, ఆయ‌న నాయ‌క‌త్వంలో కాంగ్రెస్ పార్టీ మ‌రింత ముందుకు వెలుతుంద‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు. త‌న మ‌ద్ద‌తు ఖ‌ర్గేకు ఎప్పుడూ ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. పార్టీ ముందు ఎన్నో స‌వాళ్లు ఉన్నాయ‌ని, వాటిని అధిగ‌మిస్తార‌ని చెప్పారు.

అనంత‌రం ఖ‌ర్గే మాట్లాడుతూ.. త‌నపై న‌మ్మ‌కం ఉంచిన ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. కాంగ్రెస్ పార్టీ సిద్దాంతాల‌ను ముందుకు తీసుకుపోవ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌న్నారు. త‌న బాధ్య‌త‌ల నిర్వ‌హ‌ణ‌లో ప్ర‌తి ఒక్క‌రి స‌హ‌కారం తీసుకుంటాన‌ని చెప్పారు. సోనియా గాంధీ ఏనాడు ప‌ద‌వుల‌ను ఆశించ‌లేద‌న్నారు. ఆమె నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు అధికారంలోకి వ‌చ్చింద‌ని గుర్తు చేశారు. ఇక రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశ వ్యాప్తంగా నిర్వ‌హిస్తోన్న భార‌త్ జోడో యాత్ర‌కు విశేష స్పంద‌న వ‌స్తోంద‌ని ఖ‌ర్గే అన్నారు.

Next Story