బీజేపీపై కేసీఆర్‌, కేటీఆర్ విష‌ప్ర‌చారం : కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి

Kishan Reddy comments on CM KCR and KTR.తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ చేప‌ట్టిన ప్ర‌జా సంగ్రామ యాత్ర

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 May 2022 7:11 AM GMT
బీజేపీపై కేసీఆర్‌, కేటీఆర్ విష‌ప్ర‌చారం : కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ చేప‌ట్టిన ప్ర‌జా సంగ్రామ యాత్ర శ‌నివారం రంగారెడ్డి జిల్లా మ‌హేశ్వ‌రంలో ముగియ‌నుంది. ఈ సంద‌ర్భంగా తుక్కుగూడ‌లో నిర్వ‌హించే బ‌హిరంగ స‌భ‌కు కేంద్ర మంత్రి అమిత్ షా హాజ‌రుకానున్నారు. ఈ నేప‌థ్యంలో అక్క‌డి ఏర్పాట్ల‌ను కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి శుక్ర‌వారం ప‌రిశీలించారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. బీజేపీపై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, కేటీఆర్ విష ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.

తెలంగాణ రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెర‌వ‌లేద‌ని కిష‌న్ రెడ్డి విమ‌ర్శించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎఫ్‌సీఐకి అందించాల‌ని సూచించారు. ఎఫ్‌సీఐ ధాన్యాన్ని సేక‌రించేందుకు అన్ని ర‌కాలుగా ఏర్పాట్లు చేసుకుంద‌ని తెలిపారు. రైతన్న‌ల‌ను ఆదుకోవాలన్న దృక్ప‌థంతో కేంద్ర ప్ర‌భుత్వం అన్న‌దాత‌ల‌కు అనుకూలంగా నిర్ణ‌యాలు తీసుకుంటోంద‌న్నారు.

రైతుల‌కు వాస్త‌వ ప‌రిస్థితులను ప్ర‌జా సంగ్రామ యాత్ర స‌భ‌లో తెలియ‌జేస్తామ‌ని చెప్పారు. ఇంత‌కు ముందు రాష్ట్ర ప్ర‌భుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయ‌క‌పోవ‌డంతో వ‌ర్షాల‌కు ధాన్యం త‌డిసి, వ‌ర‌ద‌ల‌కు కొట్టుకు పోయింద‌న్నారు. దీంతో రైతులు న‌ష్ట‌పోయార‌న్నారు. అన్ని పార్టీలు రైతుల‌కు అండ‌గా నిల‌బ‌డాల‌ని కోరారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగ‌ర‌వేస్తామ‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు.

Next Story