కుటుంబ పాలన, అవినీతి నిర్మూలనే బీజేపీ లక్ష్యం: కిషన్‌రెడ్డి

బీఆర్ఎస్‌ ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Srikanth Gundamalla  Published on  6 July 2023 6:15 PM IST
Kishan Reddy, CM KCR, BJP, BRS, Telangana,

కుటుంబ పాలన, అవినీతి నిర్మూలనే బీజేపీ లక్ష్యం: కిషన్‌రెడ్డి

బీఆర్ఎస్‌ ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతోమంది పోరాటం, బలిదానాల ఫలితంగా తెలంగాణ ఏర్పడిందని.. కానీ ఇప్పుడు ఒక కుటుంబం చేతిలోనే రాష్ట్రం బందీ అయ్యిందని అన్నారు. రాష్ట్రంలో నయా నిజాం తరహా పాలన సాగుతోందని విమర్శించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి.

మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి కిషన్‌రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. బీజేపీకి రెండు లక్ష్యాలు ఉన్నాయని చెప్పారు. ఒకటి కుటుంబ పాలనను అంతం చేయడం.. అవినీతి లేకుండా చేయడమే అని తెలిపారు. ఈ రెండు విషయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఎర్రకోట నుంచి స్పష్టమైన లక్ష్యాన్ని భారత ప్రజల ముందు పెట్టారని తెలిపారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని కిషన్‌రెడ్డి అన్నారు. నిరంకుశ పాలనను గుడ్‌బై చెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారని.. ఇక కల్వకుంట్ల కుటుంబం ఫామ్‌ హౌజ్‌కే పరిమితం అవుతుందని చెప్పారు కిషన్‌రెడ్డి.

సీఎం కేసీఆర్ ఇచ్చిన ఎన్నో హామీలను మర్చిపోయారని చెప్పారు. ఎస్సీలకు వెన్నుపోటు పొడిచి సీఎం పీఠం ఎక్కారని అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక దళితుడిని సీఎం చేస్తానని.. ఇప్పుడు ఆ మాటే ఎత్తడం లేదన్నారు. గిరిజన బంధు అమలు ఏమైందో కేసీఆర్ చెప్పాలని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. రైతులకు ఉచిత ఎరువులు ఇస్తామన్నారు.. దానికీ అతీగతి లేదన్నారు. ఇక రూ.లక్ష రైతు రుణమాఫీ ఏమైందో చెప్పాలన్నారు. పార్టీ కార్యాలయాలకు భూములు కేటాయిస్తున్నారు కానీ.. పేదలకు ఇచ్చేందుకు మనసు రావడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం సైన్స్‌ సిటీ ఏర్పాటు చేస్తామని చెబుతుంటే భూమి ఇవ్వడం లేదని విమర్శించారు. మెట్రో లైన్‌ను పాతబస్తీకి ఎందుకు విస్తరించడం లేదో చెప్పాలని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి.

Next Story