నలభై యేళ్ల తర్వాత తొలిసారి ఎమ్మెల్యేగా ఓడిన కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 4 Dec 2023 8:10 AM GMTనలభై యేళ్ల తర్వాత తొలిసారి ఎమ్మెల్యేగా ఓడిన కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే.. అనుకున్న దానికన్నా తక్కువ స్థానాల్లో గెలవడంతో బీఆర్ఎస్ ఆలోచనలో పడింది. ఎక్కడ తప్పు జరిగిందనే దానిపై పార్టీ అధిష్టానం పోస్టుమార్టం మొదలుపెట్టనుంది. అయితే.. ఆ పార్టీ అధినేత కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేశారు. అక్కడ బీఆర్ఎస్ గెలుపు ఖాయం అనుకున్న అందరికీ షాక్ ఎదురైంది. కేసీఆర్ కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి కె. వెంకట రమణారెడ్డి చేతిలో ఓడిపోయారు. తద్వారా నలభై ఏళ్ల తర్వాత తొలిసారి కేసీఆర్ ఓటమిని చవి చూశారు.
కేసీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొదటిసారి 1983లో సిద్దిపేట నుంచి తొలిసారిగా టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. తన రాజకీయ గురువు, కాంగ్రెస్ అభ్యర్థి అనంతుల మధుసూదన్ చేతిలోనే ఓటమి పాలయ్యారు. ఆతర్వాత 1985లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ టీడీపీ అభ్యర్థిగానే పోటీ చేసిన కేసీఆర్.. కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్‌ను ఓడించి సిద్దిపేట ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నిక అయ్యారు. ఆ తర్వాత 1989, 1994, 1999లో టీడీపీ అభ్యర్థిగా వరుసగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 1999లో గెలుపు తర్వాత తెలంగాణ కోసం గొంతెత్తారు కేసీఆర్. 2001లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారు. 2001లో సిద్దిపేట ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీని స్థాపించి.. అదే పార్టీ నుంచి పోటీ చేసి ఐదో సారి ఎమ్మెల్యేగా గెలిచారు.
ఆ తర్వాత 2004లో సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా.. కరీంనగర్ నుంచి తొలిసారి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. లోక్‌సభలో.. తెలంగాణ తరఫున గట్టిగా పోరాడాలని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగానే ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ సాధనే లక్ష్యంగా 2006, 2008లో కరీంనగర్ లోక్‌సభ స్థానానికి రాజీనా చేసి ఉపఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. తర్వాత 2009లో మహబూబ్‌నగర్ నుంచి కూడా ఎంపీగా పోటీ చేసి గెలిచారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014లో గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. మెదక్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. టీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటుకి మెజార్టీ రావడంతో ఎంపీ పదవికి రాజీనామా చేసి.. సీఎం గా ప్రమాణస్వీకారం చేశారు. 2018లో మరోసారి గజ్వేల్ నుంచే పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు కేసీఆర్.
అయితే.. ఈసారి రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేశారు. గజ్వేల్ వరుసగా మూడోసారి గెలిచినా.. కామారెడ్డిలో మాత్రం ఓటమిని చూశారు. కామారెడ్డిలో ఓటమి ద్వారా 40 ఏళ్ల తర్వాత ఓటమి పాలయ్యారు. కాగా.. కేసీఆర్ ఇప్పటి వరకు తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణలో ఇప్పటి వరకు ఎవరూ 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచింది లేదు. అంతేకాదు.. ఎంపీగా కేసీఆర్ 5 సార్లు విజయం సాధించారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో కేసీఆర్ రాష్ట్ర మంత్రిగా, రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా, కేంద్ర మంత్రిగా.. ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం పాత్ర కూడా పోషించనున్నారు కేసీఆర్.