పొత్తును కాపులు అంగీకరించలేకపోతున్నారా?.. పవన్ కల్యాణ్‌పై ఎందుకీ ఒత్తిడి!
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. అయితే జనసేనలో జరుగుతున్న పరిణామాలతో కాపులు పూర్తిగా నిరుత్సాహానికి గురవుతున్నారు.
By అంజి Published on 27 Dec 2023 11:22 AM IST
పొత్తును కాపులు అంగీకరించలేకపోతున్నారా?.. పవన్ కల్యాణ్‌పై ఎందుకీ ఒత్తిడి!
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. అయితే జనసేనలో జరుగుతున్న పరిణామాలతో కాపులు పూర్తిగా నిరుత్సాహానికి గురవుతున్నారు. పవన్ కళ్యాణ్‌ను కాకుండా చంద్రబాబు నాయుడు పేరును నారా లోకేష్ సీఎం అభ్యర్థిగా ప్రకటించడం పట్ల వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు జనసేనను 15-20 సీట్లకే చంద్రబాబు పరిమితం చేస్తున్నారనే వార్తలు కూడా వారిని కలవరపెడుతున్నాయి. ఇన్నేళ్ల తమ ఆశలు ఈసారి కూడా అడియాసలే అవుతాయన్న సంకేతాలు వారిని చుట్టుముడుతున్నాయి.
ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా చూస్తామని చెబుతున్న జనసేన అధినేత పవన్, టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలు బాగానే ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో కాపు నాయకులు ఈ పొత్తును అంగీకరించలేక పోతున్నట్టు కనిపిస్తోంది. పొత్తు విషయం పై జనసేనలోని కాపు నాయకులు రగిలిపోతున్నారని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య పొత్తు చర్చలు కొనసాగుతున్నప్పటికీ, లోకేష్ దాని ప్రాముఖ్యతను విస్మరించి, సైలెంట్‌గా జనసేనను పక్కన పెడుతున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా పవన్ కళ్యాణ్ 40-45 సీట్లు డిమాండ్ చేయాలని కాపులు కృతనిశ్చయంతో ఉన్నారు.
కూటమి విజయం సాధిస్తే క్రెడిట్‌లో గణనీయమైన వాటాను పొందాలని వారు ఆకాంక్షిస్తున్నారు. గెలిచే సీట్లలో సరైన వాటా లేకుంటే జనసేన, కాపుల ప్రయోజనాలకు టీడీపీ ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చని పవన్ కల్యాణ్‌ను కాపులు ఒప్పిస్తున్నారు. పర్యవసానంగా 40-45 సీట్లపై పట్టుబట్టి చంద్రబాబుపై ఒత్తిడి తేవాలని పవన్ కళ్యాణ్ కు సలహా ఇస్తున్నారు. దీంతో పవన్ 45 సీట్ల డిమాండ్ పై పట్టుబట్టి చంద్రబాబు నాయుడుకు అందించారు. ఫలితం తేలాల్సి ఉంది. మరోవైపు, ప్రశాంత్ కిషోర్ పవన్ కళ్యాణ్ ను హ్యాండిల్ చేస్తారని, టీడీపీకి అనుకూలంగా బ్యాలెన్స్ చేస్తారని టీడీపీ వైపు నుండి పుకార్లు ఉన్నాయి. మరి ఈ విషయంలో పవన్ ఏ మేరకు ప్రశాంత్ కిషోర్ మాటను పట్టించుకుంటారో చూడాలి.