కడపలో పరిస్థితులు తారుమారయ్యేనా.?
ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఈ ఉదయం నుంచి పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్యూ లైన్‌లలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు
By Medi Samrat Published on 13 May 2024 9:15 AM GMTఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఈ ఉదయం నుంచి పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్యూ లైన్‌లలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుందని అధికారులు కూడా పేర్కొన్నారు.
ఇదిలవుంటే.. రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా ఉన్న నియోజకవర్గాల్లో కడప లోక్‌సభ స్థానం ఒకటి. ఇక్కడ అధికార వైసీపీ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి, ఎన్డీఎ కూటమి అభ్యర్ధిగా చడిపిరాళ్ల భూపేష్ సుబ్బరామి రెడ్డి పోటీలో ఉండగా.. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కూడా ఇదే స్థానం నుంచి బరిలోకి దిగారు. దీంతో ఇక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది.
షర్మిల.. సునీత, సౌభాగ్యమ్మలతో కలిసి తన అన్న జగన్, వదిన భారతి, మరో సోదరుడు అవినాష్‌లపై వివేకా మర్డర్ లక్ష్యంగా ప్రచారంలో తీవ్రవిమర్శలు చేశారు. చివరగా తన అమ్మ మద్దతు కూడా కూడగట్టుకొని తన పక్షాన ఓట్లు అభ్యర్ధింపజేసింది. ఈ క్రమంలో షర్మిల ఎన్ని ఓట్లు సంపాదిస్తారనే టాక్ కూడా నడించింది.
ఓటింగ్ జరుగుతున్న వేళ అక్కడ విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఇక్కడ క్రాస్ ఓటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. టీడీపీని కాదని ఓటర్లు అనూహ్యంగా వైఎస్ షర్మిలకు మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం. కడప అసెంబ్లీ స్థానానికి వైసీపీకి ఓటు వేసిన వారు.. లోక్‌సభకు వచ్చేసరికి షర్మిలకు ఓటు వేస్తున్నట్టు బహిరంగ చర్చ నడుస్తుంది.
టీడీపీ బీజేపీతో జట్టు కట్టడం.. రాహుల్‌గాంధీ పర్యటనతో కడపలో ఒక్కసారిగా పరిస్థితులు మారాయి. రాజశేఖర్ రెడ్డితో కాంగ్రెస్‌కు ఉన్న బంధాన్ని రాహుల్ ప్రజలతో పంచుకున్న విధానం అందరినీ ఆకట్టుకుంది. దీంతో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వై ఎస్ వివేకానందరెడ్డి వెంట నడిచిన మైనారిటీ ఓటర్లు కొంతమేర షర్మిల వైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఇక షర్మిల భర్త బ్రదర్ అనిల్‌కుమార్ ఎన్నికల ప్రచారం కూడా ఆమెకు కలిసివచ్చినట్లు తెలుస్తుంది. క్రిస్టియన్ సామాజిక వర్గ ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలో షర్మిలకే జై కొడుతున్నట్లు సమాచారం.
జగన్ ప్రచారం అవినాష్ మైలేజీని ఇవ్వగా.. టీడీపీ అభ్యర్ధి ప్రచారంలో వెనకబడ్డారు. దీంతో టీడీపీ కార్యకర్తలు కూడా బాహాటంగానే షర్మిలకు మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కొద్దిరోజుల వరకూ కడపలో షర్మిల ప్రభావం నామమాత్రమే అనుకున్నా.. ఓటింగ్ వేళ తాజా పరిణామాలు ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నాయి.