పవన్ కళ్యాణ్‌కు కేఏ పాల్ భారీ ఆఫర్.. రూ.1000 కోట్ల నజరానా
KA Paul special offer to Pawan Kalyan.ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మంగళవారం సంచలన ప్రకటన చేశారు.
By తోట వంశీ కుమార్ Published on 7 Jun 2022 2:42 PM ISTప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మంగళవారం సంచలన ప్రకటన చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు బంపర్ ఆఫర్ ఇస్తూ తమ పార్టీలోని ఆహ్వానం పలికారు. పవన్ తన పార్టీని వీడి ప్రజాశాంతి పార్టీలో చేరితే ఎమ్మెల్యే గానో, ఎంపీ గానో గెలిపిస్తానని అన్నారు. అలా గెలిపించకపోతే రూ.1000 కోట్లు నజరానాగా ఇస్తానని చెప్పారు. పవన్ సొంతంగా పోటీ చేసినా, ఇతర పార్టీలతో కలిసి పోటీ చేసినా గెలవలేడని కేఏ పాల్ జోస్యం చెప్పారు.
బీజేపీతో చేతులు కలిపిన పవన్.. బైబిల్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఇక వచ్చే ఎన్నికల కోసం ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని కేఏ పాల్ స్పష్టం చేశారు. 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా ఉన్న చంద్రబాబు.. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడంలో విఫలమయ్యారని విమర్శించారు. చంద్రబాబు తన ఆస్తులను కాపాడుకునేందుకే తన కుమారుడు లోకేష్‌ను రాజకీయాల్లోకి తీసుకొచ్చారని కేఏ పాల్ ఆరోపించారు.
కాగా.. ఇటీవలే మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ మాట్లాడుతూ..' ఏపీలో కుల ప్రభావిత రాజకీయాలు ఆపాలనే ఉద్దేశంతోనే గతంలో బీజేపీతో, టీడీపీతో కలిశాం. కానీ.. ఈరోజు వైసీపీ కోనసీమ అల్లర్లు సృష్టించిన విధానం చాలా బాధాకరం. ప్రస్తుత రాజకీయాల్లో గుణం కాదు. కులం చూస్తున్నారు. ఇదో విచ్ఛిన్నకరమైన ధోరణి. కోనసీమ అల్లర్లను బహుజన సిద్ధాంతంపై, బహుజన ఐక్యతపై దాడిగా జనసేన చూస్తోంది. ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ పెట్టేసి, ఓట్ల రాజకీయం చేస్తున్నారు. దురదృష్టవశాత్తూ అందరూ కుల ప్రభావానికి లోనవుతున్నారు' అని పవన్ అన్నారు. అనంతరం మన దేశంలో అవినీతి అనేది రాజకీయాల్లో సహజంగా మారిందని, మనమంతా ఫేక్ ప్రపంచంలో బతుకుతున్నామని పవన్ మండిపడ్డారు.