అక్కడి నుంచే బీజేపీ అభ్యర్థిగా జీవిత రాజశేఖర్ చేస్తారా?
జీవిత రాజశేఖర్ బీజేపీ నుంచి ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.
By Srikanth Gundamalla Published on 14 Sept 2023 11:02 AM ISTఅక్కడి నుంచే బీజేపీ అభ్యర్థిగా జీవిత రాజశేఖర్ చేస్తారా?
తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులను సీఎం కేసీఆర్ 95శాతం ప్రకటించారు. వారూ ప్రజల్లోకి వెళ్తూ ప్రచారం మొదలుపెట్టారనే చెప్పాలి. మరోవైపు అసంతృప్తులను బుజ్జగించే పనిలో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఇక ఇతర పార్టీలు కూడా అభ్యర్థుల లిస్ట్‌ను రెడీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. దరఖాస్తులను కూడా స్వీకరించాయి. జీవిత రాజశేఖర్ బీజేపీ నుంచి ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈమె హైదరాబాద్‌లోని నాలుగు నియోజకవర్గాల నుంచి ఏదో చోట చాన్స్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు.
టాలీవుడ్‌కు చెందిన సెలబ్రిటీ కపుల్‌లో రాజశేఖర్, ఆయన సతీమణి జీవితకు ప్రత్యేకమైన స్థానం ఉంది. సినీ ఇండస్ట్రీతో పాటు రాజకీయాల్లోనూ వారు యాక్టివ్‌గా ఉంటున్నారు. ఒకప్పుడు వైఎస్‌ఆర్ ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తర్వాత బీజేపీలోకి వచ్చారు. ఆ తర్వాత వైసీపీ కండువా కప్పుకుని గత ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ప్రచారం కూడా చేశారు. ఏమయిందో తెలియదు కానీ.. ఆ పార్టీలో తగిన ప్రాధాన్యత లేదంటూ మళ్లీ బీజేపీకి దగ్గరయ్యారు. తాజాగా ఈసారి బీజేపీ తరఫున తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని జీవిత రాజశేఖర్ నిర్ణయించుకున్నారు. ఆ మేరకు అధిష్టానానికి దరఖాస్తు కూడా చేసుకున్నారు. హైదరాబాద్‌లోని నాలుగు నియోజకవర్గాల నుంచి ఎక్కడో ఒక చోట అకవాశం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది.
జూబ్లీహిల్స్, సనత్‌నగర్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌లో ఒక చోట నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని బీజేపీ నాయకత్వాన్ని జీవిత రాజశేఖర్ కోరారు. అయితే.. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కావడంతో.. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఎక్కుగా ఉండే జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచే పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. అధిష్టానం కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. జీవిత రాజశేఖర్ అభ్యర్థన మేరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి అవకాశం ఇస్తారా అనేదానిపై క్లారిటీ రావాలంటే జాబితా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే. మరోవైపు తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 10లోపు రాకపోతే ఎన్నికలు ఆలస్యం అయ్యే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతోంది.