ఊహించని ఫలితాలు.. వైసీపీ రాజకీయ భవితవ్యం ఏమిటి.?
5 సంవత్సరాల కాలంలో భారీ మెజారిటీ నుండి మనుగడ కోసం యుద్ధం చేసే పరిస్థితి వైసీపీకి వచ్చింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల అదృష్టం ఐదేళ్ల వ్యవధిలో ఊహించని విధంగా మారిపోయింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 4 Jun 2024 12:17 PM GMT5 సంవత్సరాల కాలంలో భారీ మెజారిటీ నుండి మనుగడ కోసం యుద్ధం చేసే పరిస్థితి వైసీపీకి వచ్చింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల అదృష్టం ఐదేళ్ల వ్యవధిలో ఊహించని విధంగా మారిపోయింది. ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందించామని భావించిన వైసీపీ ప్రభుత్వం 2024 ఎన్నికల్లో ఘోర ఓటమిని చవి చూడాల్సి వచ్చింది
2011లో తన తండ్రి, ఆంధ్ర ప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత వైఎస్ఆర్సీపీని స్థాపించిన జగన్ మోహన్ రెడ్డి, అధికార పీఠంలోకి రావడానికి మరో ఎనిమిదేళ్లు వేచి ఉండాల్సి వచ్చింది. 1972 డిసెంబర్ 21న కడప జిల్లా జమ్మలమడుగులో జన్మించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి కడప లోక్‌సభ స్థానానికి పోటీ చేసి తొలిసారిగా రాజకీయాల్లోకి వచ్చారు. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో విజయం సాధించారు. కానీ ఆ ఆనందం స్వల్పకాలికం. దురదృష్టవశాత్తూ, 2009 సెప్టెంబర్ 2న రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత ఆయన పొలిటికల్ జర్నీలో మరో అంకం మొదలైంది.
ఆ తర్వాత జరిగిన పరిణామాల కారణంగా జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో తెగతెంపులు చేసుకుని మార్చి 12, 2011న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సిపి)ని స్థాపించారు. ఆ తర్వాత అవినీతి ఆరోపణలపై 16 నెలల పాటూ జైలు జీవితం గడిపారు. సెప్టెంబరు 24, 2013న చంచల్‌గూడ జైలు నుండి విడుదలైన వెంటనే జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సంగ్రామంలోకి ప్రవేశించారు, అయితే 2014 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తృటిలో అధికారాన్ని చేజిక్కించుకోవడంలో విఫలమయ్యారు.
బీజేపీతో పొత్తు, జనసేన నుండి బయటి మద్దతుతో టీడీపీ విజయం సాధించింది. 2019 ఎన్నికలలో విజయాన్ని రుచి చూడడానికి YSRCP అధినేతకు మరో ఐదేళ్ల సమయం పట్టింది. ఆ తర్వాత 151 అసెంబ్లీ, 22 లోక్‌సభ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది.
2019 ఎన్నికలకు ముందు సంవత్సరాల్లో దక్షిణాది రాష్ట్రవ్యాప్తంగా వందల కిలోమీటర్ల పాదయాత్రల ద్వారా జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు దగ్గరయ్యారు. ఐదేళ్ల సంక్షేమ కేంద్రీకృత పాలన తర్వాత, జగన్ మోహన్ రెడ్డి మళ్లీ 2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేనల NDA కూటమికి వ్యతిరేకంగా పోరాడారు. రాజకీయ ప్రత్యర్థులతో పాటు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎపిసిసి) అధ్యక్షురాలు, సోదరి వై.ఎస్.షర్మిల, మరో సోదరి సునీత నర్రెడ్డి వంటి కుటుంబ సభ్యుల నుండి వచ్చిన వ్యతిరేకత, ప్రతికూల ప్రచారాలను కూడా సీఎం జగన్ ఎదుర్కోవాల్సి వచ్చింది.
2024 ఎన్నికల్లో వైసీపీ దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకుంది. రాబోయే 5 సంవత్సరాలు వైసీపీ ఎలా నిలబడగలుగుతుందో చూడాలి.