తెలంగాణ బీజేపీ సీఎం అభ్యర్థి కిషన్ రెడ్డి కాదా?

కొన్ని రోజుల కిందట కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్‌రెడ్డిని భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా నియమించింది.

By అంజి  Published on  23 Aug 2023 8:30 AM GMT
Kishan Reddy , CM candidate, Telangana, BJP

తెలంగాణ బీజేపీ సీఎం అభ్యర్థి కిషన్ రెడ్డి కాదా?

కొన్ని రోజుల కిందట కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్‌రెడ్డిని భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా నియమించింది. అయితే ఆ పార్టీ కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికే కిషన్‌ రెడ్డిని నియమించారనే చర్చ కొంతకాలంగా సాగుతోంది. ఎందుకంటే.. కిషన్ రెడ్డి ప్రజల్లో ఆదరణ ఉన్న వ్యక్తిగా ఉండటమే కాకుండా పార్టీలోని అన్ని వర్గాలలో ఆమోదయోగ్యమైన గౌరవప్రదమైన రాజకీయ నాయకుడు. ప్రజలతో పాటు అధికారుల్లో కూడా ఆయనకు గౌరవం ఉంది. ప్రతికూల వ్యాఖ్యలు చేసే బండి సంజయ్ లాంటి వ్యక్తిని ఇష్టపడని వర్గాల వారు ఉండొచ్చు కానీ కిషన్ రెడ్డి పట్ల ఎవరికీ ప్రతికూల భావన లేదు. రాజకీయంగా తటస్థంగా ఉన్నవారు కూడా కిషన్ రెడ్డిని గౌరవిస్తారు.

అయితే ఓ వర్గం మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం.. కిషన్ రెడ్డిని సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు బీజేపీ కేంద్ర నాయకత్వం పెద్దగా ఆసక్తి చూపడం లేదని సమాచారం. వాస్తవానికి కిషన్‌రెడ్డికి ఈసారి అసెంబ్లీ టిక్కెట్‌ ఇవ్వకపోవచ్చని, అయితే రాజ్యసభకు నామినేట్‌ చేస్తారని నివేదికలు చెబుతున్నాయి. ఈ నివేదికల ప్రకారం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేట నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు కిషన్‌రెడ్డి భార్య కావ్యారెడ్డికి బీజేపీ టిక్కెట్టు ఇచ్చే అవకాశం ఉంది. ఆమె రాజకీయాల్లోకి తొలిసారి వచ్చినప్పటికీ, ఆమెను అంబర్‌పేట నుంచి పోటీకి దింపడం మహిళా ఓటర్లను ఆకర్షిస్తుందని పార్టీ భావించింది.

ముషీరాబాద్ లేదా సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మిని కూడా పార్టీ పోటీకి దించవచ్చు. కేవలం ఏడుగురు మహిళలకు మాత్రమే పార్టీ టిక్కెట్లు ఇచ్చిన భారత రాష్ట్ర సమితికి పూర్తి విరుద్ధంగా, బిజెపి ఎన్నికలలో పార్టీకి భారీ మైలేజ్ తెచ్చే విధంగా మంచి సంఖ్యలో మహిళా అభ్యర్థులను రంగంలోకి దింపాలని యోచిస్తోంది. దీని ప్రకారం డీకే అరుణ, విజయశాంతి, జయసుధ, బండ కార్తీక రెడ్డి, జూలూరు కీర్తిరెడ్డి, గీతా మూర్తి, రాణి రుదరామ, ఆకుల విజయ, శ్రీ వాణి, డాక్టర్ వీరపనేని పద్మ వంటి పలువురు మహిళా నేతలు టిక్కెట్లు ఖరారైన వారిలో ఉన్నట్లు సమాచారం.

Next Story