ఐఎస్‌బీ 20వ వార్షికోత్స‌వం : హాజ‌రుకానున్న ప్ర‌ధాని, సీఎం కేసీఆర్ మాటేమిటి..?

ISB20 PM to attend function will KCR Join.ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్‌బీ) 20వ వార్షికోత్స‌వాన్ని మే 26న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 May 2022 2:17 AM GMT
ఐఎస్‌బీ 20వ వార్షికోత్స‌వం : హాజ‌రుకానున్న ప్ర‌ధాని, సీఎం కేసీఆర్ మాటేమిటి..?

ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్‌బీ) 20వ వార్షికోత్స‌వాన్ని మే 26న జ‌రుపుకుంటోంది. ఈ వార్షికోత్స‌వ కార్య‌క్ర‌మంలో పాల్గొనాల్సిందిగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ల‌ను ఐఎస్‌బీ ఆహ్వానించింది. అయితే.. ప్రస్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ఒకే వేదిక‌పై వీరు క‌నిపిస్తారా..? లేదా అన్న‌ది రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది.

గ‌త కొంత కాలంగా అనేక విష‌యాల్లో టీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి, బీజేపీకి మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలోనే కేంద్రంలోని బీజేపీతో సై అంటూ సై అంటూ టీఆర్ఎస్ వ్య‌వ‌హ‌రిస్తోంది. మ‌రో వైపు తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌కు ప్ర‌భుత్వానికి మ‌ధ్య దూరం పెరిగింద‌నే వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఇటీవ‌ల ఓ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో గ‌వ‌ర్న‌ర్ తమిళిసై సౌందరరాజన్ సైతం రాజ్‌భ‌వ‌న్‌కు కేసీఆర్ ఎంత దూరం పాటిస్తున్నారు అనే దానిపై మాట్లాడారు.

ఇక‌.. రంగారెడ్డి జిల్లాలోని ముచ్చింత‌ల్‌లో స్టాచ్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ విగ్ర‌హాన్ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆవిష్క‌రించగా.. అనారోగ్య కార‌ణాల‌తో సీఎం కేసీఆర్ ఆ కార్య‌క్ర‌మానికి దూరంగా ఉన్న సంగ‌తి తెలిసిందే.ఈ నేప‌థ్యంలో ఐఎస్‌బీ వార్షికోత్స‌వ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, గ‌వ‌ర్న‌ర్ తమిళిసై సౌందరరాజన్ ల‌లో క‌లిసి సీఎం కేసీఆర్ పాల్గొంటారా..? లేదా అన్నది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టికే ప్ర‌ధాని కార్యాల‌యం ఆహ్వానాన్ని అంగీక‌రించింద‌ని, ప‌ర్య‌ట‌న‌ను ధృవీక‌రించిన‌ట్లు ఐఎస్‌బీలోని ఓ అధికారి న్యూస్‌మీట‌ర్‌తో చెప్పారు. అయితే.. సీఎంవో కార్యాల‌యం నుంచి సీఎం కేసీఆర్ హాజ‌రు పై స్ప‌ష్ట‌త రావాల్సి ఉంద‌ని సద‌రు అధికారి తెలిపారు.

ఇక్క‌డ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. సీఎం కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల‌పై దృష్టిపెట్టారు. ఈ క్ర‌మంలో దేశ వ్యాప్త ప‌ర్య‌ట‌న‌ల‌కు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న కేసీఆర్ వివిధ రాజకీయ పార్టీల నేతలు, ఆర్థికవేత్తలు, మీడియా ప్రముఖులతో సమావేశం కానున్నారు.

షెడ్యూల్ ప్ర‌కారం.. ఈనెల 22న చండీగఢ్‌లో పర్యటించనున్న కేసీఆర్.. ఆందోళనలో ప్రాణాలు కోల్పోయిన 600 మంది రైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున అందజేయనున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్‌తో కలిసి కేసీఆర్ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీకి చెందిన మృతుల కుటుంబాలకు చెక్కులను అందజేయనున్నారు.

మే 26న బెంగళూరులో పర్యటించనున్నారు. ఆయన మాజీ ప్రధాని దేవగౌడను సందర్శించి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని కలవనున్నారు. మే 27న ఆయన రాలేగావ్ సిద్ది వెళ్లి ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారేను కలవనున్నారు. షిర్డీ సాయిబాబాను కూడా కేసీఆర్ దర్శించుకోనున్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు.

మే 29, 30 తేదీల్లో కేసీఆర్ బెంగాల్, బీహార్‌లో పర్యటించనున్నారు. గాల్వాన్ లోయలో అమరులైన భారత జవాన్ల కుటుంబాలను సీఎం పరామర్శించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం గతంలో ప్రకటించిన విధంగా వారి కుటుంబాలను సీఎం ఆదుకోనున్నారు.

ప్ర‌స్తుతం ఉన్న షెడ్యూల్ ప్ర‌కారం చూసుకుంటే ప్ర‌ధాని మంత్రితో క‌లిసి సీఎం కేసీఆర్ ఐఎస్‌బీ వార్షికోత్స‌వంలో పాల్గొన‌డం కాస్త క‌ష్ట‌మే. అయితే.. షెడ్యూల్‌లో ఏమైనా మార్పులు చేసుకుంటారో, లేదో అన్న అంశంపై స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది.

ఇక షెడ్యూల్ ప్ర‌కారం ప్ర‌త్యేక విమానంలో మే 26న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ బేగంపేట విమానాశ్ర‌యానికి చేరుకుంటారు. అక్క‌డి నుంచి రోడ్డు మార్గంలో లేదంటే హెలికాఫ్ట‌ర్‌లో గ‌చ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ క్యాంప‌స్‌కు చేరుకుంటారు. ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న నేఫ‌థ్యంలో ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌పై తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేష్‌కుమార్ శుక్ర‌వారం స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు.

Next Story