తెలంగాణలో కర్ణాటక గెలుపును రిపీట్ చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ఉందా?
ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో.. తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఆ పార్టీ
By అంజి Published on 14 May 2023 12:01 PM ISTతెలంగాణలో కర్ణాటక గెలుపును రిపీట్ చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ఉందా?
హైదరాబాద్: ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో.. తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఆ పార్టీ ఇప్పుడు ప్రత్యేక దృష్టి సారించింది. తెలంగాణలో కాంగ్రెస్ విజయాన్ని పునరావృతం చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి మహ్మద్ అలీ షబ్బీర్ విశ్వాసం వ్యక్తం చేశారు. కర్ణాటక గెలుపు ఒక మలుపు అని, ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ విభజన రాజకీయాల నుంచి ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే స్పష్టమైన సూచన అని షబ్బీర్ అలీ అభివర్ణించారు.
''అభివృద్ధిపై దృష్టి సారించే, విభజన రాజకీయాలను తిరస్కరించే రాజకీయాలకు ప్రజలు మద్దతు ఇస్తున్నారని కర్ణాటక విజయం తెలియజేస్తోంది. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే ఒరవడి కొనసాగుతుందని భావిస్తున్నాం'' అని అన్నారు. విజయవంతమైన ప్రచారంలో పార్టీ నేతలు సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాత్రను కూడా కాంగ్రెస్ అధినేత హైలైట్ చేశారు. గెలుపులో పార్టీ నాయకత్వం కీలక పాత్ర పోషించిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇటీవల ముగిసిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో, కాంగ్రెస్ రాష్ట్రంలో 135 స్థానాలను కైవసం చేసుకుంది. ఇది భారతదేశంలోని దక్షిణ ప్రాంతంలో బీజేపీ రాజకీయ పట్టును గణనీయంగా దెబ్బతీసింది. ఫలితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కింగ్‌మేకర్ పాత్ర పోషించాలనే జనతాదళ్ (సెక్యులర్) ఆశలు అడియాశలయ్యాయి. బీజేపీ ఓటమి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై రాజీనామాకు దారితీసింది.
ఇప్పుడు ఫోకస్ ఇతర రాష్ట్రాలపైకి మళ్లడంతో తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం అవుతుండగా, కర్ణాటక విజయాన్ని పునరుద్ఘాటించేందుకు ఆ పార్టీ నాయకత్వం కసరత్తు చేసే అవకాశం ఉంది.