మునుగోడు ఉప ఎన్నిక : కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి..?
Hectic parleys in Congress for Munugode candidate.తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక చుట్టే రాజకీయం
By తోట వంశీ కుమార్ Published on 26 Aug 2022 10:03 AM ISTతెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక చుట్టే రాజకీయం నడుస్తోంది. అన్ని పార్టీలు ఉప ఎన్నికలో సత్తా చాటాలని ప్రయత్నాలు ప్రారంభించాయి. మరో సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మిగతా పార్టీలు ఎవరిని తమ అభ్యర్థిగా దించాలనే దానిపై తలమునకలై ఉండగా.. హస్తం పార్టీలో మాత్రం అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. సొంత గూటిలోని నేతలే ఒకరిపై మరొకరు మాటల యుద్ధం చేసుకున్నారు.
ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు సద్దుమణుగుతున్నాయి. కొందరు సీనియర్ నేతలు ఢిల్లీ వెళ్లి సోనియా, ప్రియాంక గాంధీలను కలిసి రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను వివరించారు. వారి సూచనల మేరకు నేతలంతా ప్రస్తుతం మునుగోడుపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థిని ఖరారు చేసే అంశంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది.
ఈ క్రమంలో గురువారం గాంధీభవన్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మునుగోడు టికెట్ ఆశిస్తున్న పాల్వాయి స్రవంతి,పల్లె రవి, పున్నా కైలాశ్‌నేత, చల్లమల్ల కృష్ణారెడ్డిలతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన నాయకుడు దామోదర్ రెడ్డి లు విడివిడిగా భేటీ అయ్యారు. మీరు ఎందుకు ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు..? మళ్లీ ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉంది..? అయినా పోటీ చేస్తారా..? మీ బలం, బలహీనత ఏంటీ..? ఒకవేళ బరిలో ఉంటే మీ ప్రణాళిక ఏంటీ..? అన్న ప్రశ్నలు అడిగి వారి అభిప్రాయాలు తెలుసుకున్నట్లు తెలుస్తోంది.
సాయంత్రం భట్టి విక్రమార్క భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. దాదాపు గంట పాటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో చర్చలు జరిపారు. రెండు రోజులుగా మునుగోడు అభ్యర్థి ఎంపికపై పార్టీలో జరుగుతున్న కసరత్తుపై కోమటిరెడ్డికి వివరించారు. ఆశావహుల పేర్లను కోమటిరెడ్డికి తెలియజేశారు. మునుగోడు అభ్యర్థి విషయంలో ఆయన అభిప్రాయం తెలుసుకోవడంతో పాటు ఈ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిని సర్వేల ఆధారంగా ఎంపిక చేస్తారని, ఏఐసీసీ తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. మరోవైపు తాను మునుగోడులో ప్రచారానికి వెళ్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.
కాగా.. మూడు పేర్లతో కూడిన జాబితాను రాష్ట్ర నాయకత్వం ఏఐసీసీకి పంపినట్టు తెలుస్తోంది. ఈ జాబితాలో ఒక పేరును పార్టీ అధిష్టానం ఆమోదించి అధికారికంగా ప్రకటించనుందని సమాచారం.