బండి సంజయ్‌కు మంత్రి హరీష్ రావు సవాల్
Harish Rao challenge to Bandi Sanjay.భారతీయ జనతా పార్టీ(బీజేపీ)పై తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు
By తోట వంశీ కుమార్ Published on 4 Feb 2022 10:21 AM ISTభారతీయ జనతా పార్టీ(బీజేపీ)పై తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. యాదగిరిగుట్టలో నిర్వహించిన టీఆర్‌ఎస్‌వీ, టీఆర్‌ఎస్ యువజన విభాగం ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ తీరుపై నిప్పులు చెరిగారు. నిరుద్యోగ సమస్యపై నిర్వహించే మిలియన్ మార్చ్‌ను హైదరాబాద్‌లో కాకుండా న్యూఢిల్లీలో నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు హరీష్ రావు సవాల్ విసిరారు.
తమ హయాంలో ఎన్ని ఖాళీలున్నాయో కేంద్రం వెల్లడించాలన్నారు. వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 15 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. దేశంలోని అన్ని ఖాళీ పోస్టుల భర్తీకి టైమ్ ఫ్రేమ్ ప్రకటించాలని కోరారు. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ విషయంలో బండి సంజయ్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నిరుద్యోగ యువత గురించి బండి సంజయ్ ఆందోళన చెందితే.. ముందు తమ పార్టీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి న్యూఢిల్లీలో మిలియన్ మార్చ్ చేపట్టాలని హరీష్ రావు పేర్కొన్నారు.
దళితులు, పేదల అభ్యున్నతి కోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కలలుగన్న లక్ష్యాన్ని సాకారం చేసేందుకు సీఎం కేసీఆర్ తీవ్రంగా శ్రమిస్తున్నట్లు హరీష్‌రావు చెప్పుకొచ్చారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి నిధులు, అధికారాల పంపిణీపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్‌లో ఎన్‌ఆర్‌ఈజీపీ నిధులను తగ్గించడంపై కేంద్రం ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.