జీహెచ్‌ఎంసీ ఎన్నికలు: బీజేపీకి పూర్తి మద్దతు: పవన్‌ కల్యాణ్‌

Full support to the BJP: Pawan kalyan.. గ్రేటర్‌ హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

By సుభాష్
Published on : 20 Nov 2020 4:17 PM IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు: బీజేపీకి పూర్తి మద్దతు: పవన్‌ కల్యాణ్‌

గ్రేటర్‌ హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జనసేన అధినేత పవన్‌ కల్యాన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో జనసేన పోటీ నుంచి విరమించుకుంది. అంతేకాకుండా గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేస్తామని పవన్‌ కల్యాన్‌ అన్నారు. విస్తృత ప్రయోజనాల దృష్ట్యా పోటీ నుంచి విరమించుకున్నట్లు పవన్‌ వివరించారు.

గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి భేటీ తర్వాత పవన్‌ నిర్ణయం తీసుకున్నారు. కిషన్‌ రెడ్డి, లక్ష్మణ్‌లతో భేటీ తర్వాత పవన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఒక్క ఓటు కూడా పోకుండా జనసైనికులు బీజేపీకి సహకరించాలన్నారు. సమయం లేకపోవడం, కమ్యూనికేషన్‌ గ్యాప్‌ వల్ల పొత్తు కుదరలేదని, భవిష్యత్తులో ఎన్నికల్లోనూ కలిసి పని చేస్తామన్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ గెలవాలని పవన్‌ ఆకాంక్షించారు. మోదీ నాయకత్వంలో హైదరాబాద్‌ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోందని అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌లోని నాదెండ్ల మనోహర్‌ నివాసంలో పవన్‌ కల్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌తో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ సీనియర్‌ నేత లక్ష్మణ్‌ సమావేశమయ్యారు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, దీనికి తాజా దుబ్బాక ఉప ఎన్నికలే నిదర్శనమన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీ వియం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జనసేన తమకు మద్దతివ్వడం సంతోషంగా ఉందన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి రావాలని జనసేనను కోరామని, బీజేపీ విజయానికి పూర్తిగా సహకరిస్తామని పవన్‌ కల్యాన్‌ చెప్పారని కిషన్‌రెడ్డి అన్నారు. కాగా, గ్రేటర్‌ ఎన్నికల్లో పవర్‌ పూర్త మద్దతు కోరినట్లు లక్ష్మణ్‌ తెలిపారు. భవిష్యత్తులో కూడా బీజేపీ, జనసేన కలిసి పని చేస్తాయని లక్ష్మణ్‌ అన్నారు. హైదరాబాద్‌లో ప్రాంతీయ విబేధాలు ఉండకూడదని, పవన్‌తో భేటీలో రెండు పార్టీలు కలిసి పని చేసే అంశంపై చర్చించినట్లు ఆయన వెల్లడించారు.





Next Story