తెలంగాణలో అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై చర్చ జరుగుతుండగానే.. మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లాకు చెందిన ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ రాజకీయంగా చర్చనీయాంశమైంది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్, ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి.. ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు తాజాగా భేటీ అయ్యారు. మైనంపల్లి హన్మంతరావు ఇంట్లో ఈ భేటీ జరిగింది.
మంత్రి మల్లారెడ్డి వైఖరికి నిరసనగానే ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు కలిశారని తెలుస్తోంది. ముఖ్యంగా పదవులు, అభివృద్ధి విషయాల్లో మంత్రి మల్లారెడ్డి ఏకపక్ష వైఖరితో వ్యవహరిస్తున్నారనేది ఎమ్మెల్యేల ఆరోపణగా తెలుస్తోంది. తమ కార్యకర్తలు పదవులు ఆశిస్తున్నారని.. అయితే.. పదవులన్నీ మంత్రి నియోజకవర్గానికే తీసుకెళుతున్నారనే ఆరోపణ ఆ ఐదుగురు ఎమ్మెల్యేల నుంచి వస్తుంది. మేడ్చల్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ మార్పుపై వీరు అసంతప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మల్లారెడ్డి వైఖరిపై త్వరలో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇది రహస్య భేటీ కాదన్న ఎమ్మెల్యేలు.. దీనికి ప్రాధాన్యం లేదని చెబుతున్నారు.