ఎన్నికల హీట్.. కాంగ్రెస్, బీజేపీల మధ్య పోస్టర్ వార్
ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోస్టర్ వార్ రోజురోజుకు ముదురుతోంది.
By Srikanth Gundamalla Published on 6 Oct 2023 11:45 AM ISTఎన్నికల హీట్.. కాంగ్రెస్, బీజేపీల మధ్య పోస్టర్ వార్
దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దాంతో.. రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోస్టర్ వార్ రోజురోజుకు ముదురుతోంది. సోషల్ మీడియాలో బీజేపీ షేర్ చేసిన రాహుల్ గాంధీకి సంబంధించిన ఫొటో వివాదానికి కేరాఫ్‌గా మారింది. అయితే.. బీజేపీ రాహుల్‌గాంధీకి చెందిన 7 తలల ఫొటోను షేర్ చేయగా.. దానిపై కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ ఫొటోకు కౌంటర్‌గా కాంగ్రెస్ కూడా 'ది బిగ్గెస్ట్ లయర్', 'జుమ్లా భాయ్' అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఫోటీలను షేర్ చేస్తోంది. దాంతో.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోస్టర్ వార్ కొనసాగుతోంది.
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఈ వివాదంపై స్పందించారు. ప్రధాని మోదీ, జేపీ నడ్డా కలిసి పాలిటిక్స్‌ను ఏ స్థాయి వరకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు. విద్వేశాలను రెచ్చగొట్టాలని బీజేపీ భావిస్తోందని ఆమె ఆరోపించారు. హింసను ప్రేరేపించే విధంగా అభ్యంతకర పోస్టులు పెట్టడం సరికాదని సూచించారు. బీజేపీ ట్విట్టర్ హ్యాండిల్‌లో అలాంటి అభ్యంతరక పోస్టులను పెట్టడాన్ని మోదీ, నడ్డా సమర్ధిస్థారా అని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. ప్రమాణ స్వీకారంలో ఏం చెప్పారో ఎన్నికల సమయంలో మీరిచ్చిన హామీల్లానే మర్చిపోయారా అంటూ ఎద్దేవా చేశారు. ప్రియాంక గాంధీతో పాటు ఈ పోస్టర్ వార్ వివాదంపై జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్ వంటి నాయకులు బీజేపీ నేతలకు కౌంటర్లు ఇచ్చారు.
రాహుల్‌గాంధీని టార్గెట్ చేసి పోస్టు పెట్టారని కేసీ వేణుగోపాల్ బీజేపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీలను చంపినట్లే రాహుల్‌ని కూడా చంపాలని బీజేపీ నేతలు అనుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులు సంచలన ఆరోపణలు చేశారు. చిన్న చిన్న కారణాలను చెప్పి రాహుల్‌గాంధీకి ఉన్న ఎస్పీజీ భద్రతను తొలగించారని గుర్తు చేశౄరు. రాహుల్‌గాంధీ తన ఇంట్లో నుంచి ఖాళీ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత రిక్వెస్ట్ చేసినా రాహుల్‌గాంధీకి మరో ఇల్లు కేటాయించలేదని కాంగ్రెస్ నేతలు బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీరుని ప్రజలంతా గమనిస్తున్నారని.. ఈ ఎన్నికల్లో ప్రజలే వారికి బుద్ధి చెబుతారని అన్నారు.