కాంగ్రెస్‌తో టచ్‌లో బీఆర్ఎస్ ఎంపీ!

తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి నేతల ఫిరాయింపులు ఊపందుకున్నాయి.

By అంజి  Published on  15 Aug 2023 9:01 AM IST
BRS MP, Congress, Telangana, Nagar Karnool

కాంగ్రెస్‌తో టచ్‌లో బీఆర్ఎస్ ఎంపీ!

తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి నేతల ఫిరాయింపులు ఊపందుకున్నాయి. మరోవైపు అధికారం చేపట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదపుతోంది. ఈ క్రమంలోనే ఇతర పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నేతలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. తాజా నివేదికల ప్రకారం.. నాగర్‌కర్నూల్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ పార్లమెంటు సభ్యుడు పోతుగంటి రాములు భారత రాష్ట్ర సమితి నుండి కాంగ్రెస్‌లోకి ఫిరాయించడానికి సిద్ధంగా ఉన్నారు.

తెలుగుదేశం పార్టీ టిక్కెట్‌పై అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన 1999, 2004 మధ్య చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో యువజన, క్రీడల శాఖ మంత్రిగా పనిచేశారు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత టీడీపీ టిక్కెట్టుపై అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన రాములు 2016లో భారత రాష్ట్ర సమితి (అప్పటి టీఆర్‌ఎస్)లోకి ఫిరాయించారు. 2019లో బీఆర్‌ఎస్ నాయకత్వం ఆయనకు నాగర్‌కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఎంపీ టికెట్ ఇవ్వగా గెలుపొందాడు. అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాములు అచ్చంపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు.

ప్రస్తుతం అక్కడ ప్రభుత్వ విప్‌గా గువ్వల బాలరాజ్‌.. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే మరోసారి టికెట్‌ ఆయనకే దక్కనుందని తెలుస్తోంది. మరోవైపు గువ్వల బాలరాజుకు, రాములుకు మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. రాములు అసంతృప్తిని పసిగట్టిన సునీల్ కానుగోలు బృందం ఆయనను సంప్రదించి ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకెళ్ళేందుకు ప్రయత్నిస్తోందని వర్గాలు తెలిపాయి. అచ్చంపేట నుంచి ఆయన ఎమ్మెల్యే టికెట్‌ను అడుగుతున్నట్లు సమాచారం. ఇది ఫలిస్తే, త్వరలో ఆయన బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది.

Next Story