రంగంలోకి దిగిన దిగ్విజయ్.. రాజగోపాల్‌రెడ్డి మనసు మార్చుకుంటాడా..?
Digvijaya Singh makes call MLA Komatireddy Raj Gopal Reddy.మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని
By తోట వంశీ కుమార్ Published on 29 July 2022 8:46 AM ISTమునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడకుండా ఉండేందుకు బుజ్జగించే ప్రయత్నాలను చేస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. ఇందుకు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ను రంగంలోకి దింపింది. సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని బావిస్తోంది. ఆయనకు సహాయకుడిగా ఉండాలని ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి సూచించింది. మరోవైపు మునుగోడు నియోజకవర్గానికి చెందిన కొందరు నాయకులు కూడా రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడొద్దంటూ ఆయనకు సూచించినట్లు సమాచారం.
ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి నివాసంలో భేటీ..
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసంలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలు గురువారం భేటీ అయ్యారు. రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై రెండు గంటల పాటు చర్చించారు. ఆయన పార్టీలోనే ఉండేలా చూడాలని అధిష్టానం వీరికి సూచించినట్టు తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్‌లో కొనసాగేలా చూస్తానని ఎంపీ కోమటి రెడ్డి వెంటకట్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు మునుగోడుకు చెందిన సీనియర్ నాయకులు ఢిల్లీకి వెళ్లారు. ముఖ్య నేతలను కలిసి సమస్యను త్వరగా పరిష్కరించాలని సూచించారు. ఈ క్రమంలో శుక్రవారం లేదా శనివారం కాంగ్రెస్ నాయకులు రాజగోపాల్‌రెడ్డితో భేటీ కావాలని భావిస్తున్నట్లు సమాచారం.
అనుచరగణంతో వరుస భేటీలు
పార్టీ వీడే అంశంపై మునుగోడు నియోజకవర్గ అనుచరగణంతో రాజగోపాల్‌రెడ్డి గత మూడు రోజులుగా వరుస సమావేశాలు నిర్వహించారు. ఈ భేటీలు గురువారంతో ముగిశాయి. పార్టీ మార్పు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఎదురయ్యే ఉప ఎన్నిక, పరిణామాలు, నియోజకవర్గంలో పార్టీల తాజా పరిస్థితులపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగగా పార్టీ ని వీడొద్దని కొంతమంది అనుచరులు చెప్పినట్లు తెలిసింది. ఆయన మాత్రం నాలుగైదేళ్లుగా పార్టీ నాయకత్వం ఏ విధంగా అవమానించిందన్న విషయాన్నే వివరించినట్లు సమాచారం.
ఒత్తిడి పెంచుతున్న బీజేపీ!
ఇదిలా ఉంటే తమ పార్టీలో చేరాలని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నుంచి ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది. రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని, శుక్రవారం బండి సంజయ్, ఈటల, కిషన్‌రెడ్డి తదితర నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.
ఏ నిర్ణయం తీసుకుంటారు..?
కాంగ్రెస్ అధిష్టానం బుజ్జగిస్తున్ననేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి వెనక్కి తగ్గుతారా..? తన మనసును మార్చుకుంటారా..? లేక బీజేపీలో చేరేందుకు మొగ్గు చూపుతారా..? అన్న విషయంపై కాంగ్రెస్ క్యాడర్‌లో ఉత్కంఠ నెలకొంది. మరీ రాజగోపాల్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారో మరో రెండు మూడు రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.