మీ కుర్చీ ఇవ్వండి.. ఉన్న రెండేళ్ల కాలాన్ని దళితులకు ఇవ్వండి

Dasoju Sravan Fire On CM KCR. కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ మ‌రోమారు సీఎం కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు చేశారు.

By Medi Samrat  Published on  28 Aug 2021 3:09 PM IST
మీ కుర్చీ ఇవ్వండి.. ఉన్న రెండేళ్ల కాలాన్ని దళితులకు ఇవ్వండి

కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ మ‌రోమారు సీఎం కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు చేశారు. శ‌నివారం ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ.. దళితుల కోసం రక్తం దారపోస్త అని సీఎం కేసీఆర్ అంటున్నారు.. మీ రక్తం దళితులకు అవసరం లేదు.. మీ కుర్చీ ఇవ్వండి.. ఉన్న రెండేళ్ల కాలాన్ని దళితులకు ఇవ్వండి చాలు అని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో దళిత నాయకుడే సీఎంగా ఉంటారని.. లేకపోతే తల నరుక్కుంటా అని చెప్పి మాట తప్పారని మండిప‌డ్డారు.

దళితులకు బడ్జెట్‌లో మిగిలిపోయిన సబ్ ప్లాన్ నిధులు రూ. 65 వేల కోట్లు విడుదల చేయాల‌ని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ బూతు మాటలను ఇన్నాళ్లు భరించాం.. కానీ, ఇక నుంచి సహించేది లేదని.. ఏడున్నర ఏళ్లలో కేసీఆర్ మాట్లాడిన భాషపై రాహుల్ గాంధీ సమక్షంలో చర్చకు సిద్ధమా.. అని స‌వాల్ విసిరారు. ప్రశ్నించే గొంతుకలను అణిచివేస్తున్నారని.. తీన్మార్ మల్లన్నను ఎందుకు అరెస్ట్ చేశారో.. ఎక్కడ పెట్టారో తెలియ‌ద‌ని ఫైర్ అయ్యారు.

2 లక్షల ఉద్యోగాలు ఖాళీలున్నాయని.. వాటిని భర్తీ చేస్తే 40 వేల ఉద్యోగాలు దళితులకు వస్తాయని చెప్పారు. ఉద్యమకాలంలో 1200 మంది చనిపోతే.. 500 మందికే పరిహారం చెల్లించి చేతులు దులుపుకొన్నారని.. తెలంగాణ కోసం చనిపోయిన వారికి విగ్రహాలు పెడతామని చడీచప్పుడు లేదని.. ఇకనైనా సీఎం కేసీఆర్ సభ్యత , సంస్కారంతో కూడిన రాజకీయాలు చేయాలని దాసోజు శ్రావణ్ వ్యాఖ్యానించారు.


Next Story