తెలంగాణ రాజకీయం మునుగోడు చుట్టూ తిరుగుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి, పార్టీకి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్, సిట్టింగ్ కాంగ్రెస్, రాజగోపాల్ రెడ్డిని బరిలోకి దింపుతున్న బీజేపీ కసరత్తులు ప్రారంభించగా.. తాజాగా కమ్యూనిస్టులు కార్యచరణ ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా.. ఒకప్పుడు ఉభయ కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉండేది. కానీ క్రమంగా జిల్లాలో ఉనికిని కోల్పోయింది. అయితే ఎన్నికలను ప్రభావితం చేయగల స్థితిలో మాత్రం కమ్యూనిస్టులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మునుగోడు ఉప ఎన్నికలో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నేడు జరుగనుంది. సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సీనియర్ నాయకులు చాడా వెంకటరెడ్డి, కునంనేని సాంబశివరావు, పల్లా వెంకట్ రెడ్డి, అజీజ్ పాషా తదితరులు పాల్గొననున్నారు. ఈ రోజు మూడు గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. సమావేశంలో మునుగోడు ఉప ఎన్నిక, పార్టీ రాష్ట్ర, జాతీయ మహాసభలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మునుగోడులో సీపీఐ ఇప్పటి వరకూ ఐదుసార్లు గెలిచింది. 2014 లో కాంగ్రెస్ రెబల్ పాల్వాయి స్రవంతి పోటీతో ఓటమి చెందింది. సెప్టెంబర్ 4 నుండి 7 వరకు శంషాబాద్ లో రాష్ట్ర మహాసభలు జరుగనున్నాయి. అక్టోబర్ 14 నుండి 17 వరకు విజయవాడలో జాతీయ మహాసభలు జరుగుతాయి.