కాంగ్రెస్‌తో సీపీఐకి కుదిరిన పొత్తు.. కొత్తగూడెం నుంచి పోటీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐతో కాంగ్రెస్‌కు పొత్తు కుదిరిందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

By Srikanth Gundamalla  Published on  6 Nov 2023 2:12 PM GMT
CPI, alliance,  Congress, Kothagudem, telangana,

కాంగ్రెస్‌తో సీపీఐకి కుదిరిన పొత్తు.. కొత్తగూడెం నుంచి పోటీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ పొత్తుల విషయంలో కాంగ్రెస్‌ ఆచితూచి అడుగులు వేస్తోందనే చెప్పాలి. ఇప్పటికే షర్మిల, కోదండరాం తాము కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. అంతేకాక మరోపార్టీ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కూడా కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తామని వెల్లడించింది. అయితే.. వామపక్షాలతో కూడా కాంగ్రెస్‌ ఇప్పటికే చర్చలు జరిపింది. కానీ.. సీపీఎం తమకు అవమానం జరిగిందని.. తాము అడిగిన సీట్లు ఇవ్వడం లేదంటూ తొలి జాబితా విడుదల చేసింది. కానీ.. సీపీఐ మాత్రం అలా చేయలేదు. దాంతో.. కాంగ్రెస్‌ చర్చలు ముమ్మరం చేసి ఎట్టకేలకు ఒప్పించింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐతో కాంగ్రెస్‌కు పొత్తు కుదిరిందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వెల్లడించారు. పొత్తులో భాగంగా కొత్తగూడెం నుంచి సీపీఐ పోటీ చేస్తుందని. ఆ నియోజకవర్గంలో సీపీఐ విజయానికి కాంగ్రెస్ కృషి చేస్తుందని రేవంత్‌రెడ్డి చెప్పారు. కాగా.. సోమవారం హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయానికి రేవంత్‌రెడ్డి వెళ్లారు. అక్కడ సీపీఐ నేతలతో ఆయన చర్చలు జరిపారు. అనంతరం పొత్తు కుదిరినట్లు వెల్లడించారు.

అయితే.. ఈ ఎన్నికల తర్వాత రెండు ఎమ్మెల్సీ స్థానాలను సీపీఐకి ఇస్తామని రేవంత్‌రెడ్డి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పెద్ద మనసు చేసుకుని కాంగ్రెస్‌కు సహకరించాలని సీపీఐని కోరినట్లు చెప్పారు రేవంత్‌రెడ్డి. దానికి సీపీఐ ఒప్పుకుందని చెప్పారు. దాంతో.. కాంగ్రెస్-సీపీఐ సమన్వయం కోసం కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. సీపీఎం ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించినప్పటికీ వారితో కూడా పొత్తు విషయమై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి.

తెలంగాణలో కాంగ్రెస్‌కు సానుకూల పవనాలు వీస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. మునుగోడులో కేవలం బీజేపీని ఓడించేందుకే బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకున్నామని గుర్తు చేశారు. కేంద్రంలో నిరంకుశపాలన కొనసాగుతోందని.. అదే విధంగా ఇప్పుడు తెలంగాణలో కూడా బీఆర్ఎస్‌ పాలన మారిందని అన్నారు కూనంనేని సాంబశివరావు. అందుకే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. ఇక సీపీఎం కూడా కాంగ్రెస్‌తో ఒక అవగాహనకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌తో స్నేహం మున్ముందు కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

Next Story