తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా పార్టీలో కొందరు కుట్రలు చేశారని, తాను పార్టీ కోసం ఎంతగానో పని చేసినా అవమానించారని.. దాన్ని తట్టుకోలేకే పార్టీనీ వీడాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు సంగారెడ్డి ఎమ్మెల్మే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి నిన్న మీడియాకు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ రోజు పార్టీ అధిష్టానానికి తన రాజీనామా లేఖను సమర్పిస్తానని ఆయన పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి ని బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. జగ్గారెడ్డిని పార్టీ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు కలిశారు. కాంగ్రెస్ పార్టీని వీడొద్దని విజ్ఞప్తి చేశారు. పార్టీలోనే ఉంటూ అన్యాయాలపై కొట్లాడాలని సూచించారు. ఈ క్రమంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. కార్యకర్తలతో మాట్లాడి తదుపరి తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని చెప్పారు. మరో వైపు పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లి కిషన్.. జగ్గారెడ్డి కాళ్లు పట్టుకుని బతిమిలాడటం గమనార్హం. పార్టీని ఎట్టి పరిస్థితుల్లో వీడొద్దని ఆయన కోరారు.
సోషల్ మీడియాలో తనపై, జగ్గారెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని వీహెచ్ హనుమంతరావు అన్నారు. తమ ఫొటోలను మార్ఫింగ్ చేసి తాము టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోనున్నట్లు కోరతానని వీహెచ్ చెప్పారు.