కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల గరంగరం
Congress Leaders Strongly Condemned Komatireddy Comments.తెలంగాణ రాష్ట్రంలో పొత్తులపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
By తోట వంశీ కుమార్ Published on 14 Feb 2023 10:32 AM GMTతెలంగాణ రాష్ట్రంలో పొత్తులపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో హంగ్ ఏర్పడే అవకాశం ఉందని, భారత్ రాష్ట్ర సమతి(బీఆర్ఎస్)తో పొత్తు పెట్టుకోవాల్సి వస్తుందని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను వీహెచ్, అద్దంకి దయాకర్, మహేశ్ కుమార్ గౌడ్, మల్లు రవి తదితరులు తప్పుపట్టారు.
ఒంటరిగా పోటి చేస్తే కాంగ్రెస్ గెలవదు అంటూ అనడం పార్టీ కార్యకర్తల మనోబావాలని, వారి నమ్మకాన్ని దెబ్బతీస్తాయని, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు. అర్థం పర్ధంలేని అంచనాలతో ఇటువంటి వ్యాఖ్యలు చేయవద్దన్నారు. ఇది కార్యకర్తలను అవమానించటమేనన్నారు.
తెలంగాణలో హంగ్ అనే మాటేలేదని కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయం అంటూ మరో కాంగ్రెస్ నేత మల్లు రవి ధీమా వ్యక్తం చేశారు. పార్టీకి మేలు చేయకపోయిన ఫర్వాలేదు కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేయవద్దు అని కోమటిరెడ్డికి హితవు పలికారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే లోటు పాట్లు ఏమన్నా ఉంటే సరిచేసుకోవచ్చునని, కానీ ఇలా బాహాటంగా ఇష్టానుసారంగా మాట్లాడితే అది పార్టీకి నష్టం చేకూరుస్తుందన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఏ పార్టీతోను పొత్తు పెట్టుకోదని ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఎవ్వరితోనూ పొత్తు ఉండదని వరంగల్ వేదికగా రాహుల్ గాంధీ స్పష్టం చేశారని అద్దంకి దయాకర్, మహేశ్ కుమార్ గౌడ్ లు చెప్పారు. అయినప్పటికీ పార్టీ కేడర్‌ను గందరగోళానికి గురి చేసే విధంగా పొత్తుపై మాట్లాడడం సరికాదన్నారు.
కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఏమన్నారంటే..?
తెలంగాణలో రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదన్నారు. హంగ్ తప్పదన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏ పార్టీ కూడా సొంతంగా 60 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోలేదన్న తన జోస్యాన్ని సమర్థించుకున్నారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదన్నారు. విభజన బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగం నేపథ్యంలో రాష్ట్రంలో పొత్తులు ఉండవచ్చనే ప్రశ్నపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్‌ను, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్‌ను కేసీఆర్ పొగడ్తలతో ముంచెత్తడంపై వెంకట్‌రెడ్డి స్పందించారు. అసెంబ్లీలో బీజేపీని విమర్శిస్తూ, కాంగ్రెస్‌ను అభినందిస్తూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమర్థించారు. అయితే తమ పార్టీని ముఖ్యమంత్రి పొగడాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు రెండూ లౌకిక యోగ్యత కలిగిన పార్టీలని అంగీకరించారు. కాంగ్రెస్‌తో కేసీఆర్ కలవక తప్పదని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే కేసీఆర్ కాంగ్రెస్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారన్నారు.
కొన్ని కారణాల వల్ల, తమ (టిపిసిసి) నాయకులు ఇప్పటికీ ఒకే వేదికపైకి రాలేకపోతున్నారని, నాయకులంతా ఏకమై కష్టపడి పనిచేస్తే తెలంగాణలో కాంగ్రెస్ 40 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని వెంకట్ రెడ్డి అన్నారు. పార్టీని విజయపథంలో నడిపించడం ఒక్క వ్యక్తి వల్ల సాధ్యం కాదని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే మరోపార్టీతో పొత్తు పెట్టుకుంటేనే సాధ్యమవుతుందని అన్నారు. మార్చి 1వ తేదీ నుంచి పాదయాత్ర, బైక్ యాత్ర చేస్తానని అన్నారు.