శ్రీదేవి కోసం బాబు స్పెషల్ ప్లాన్ ?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తాడికొండ నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఉండవల్లి శ్రీదేవి టీడీపీ తీర్థం పుచ్చుకునే పనిలో పడ్డారు.

By అంజి  Published on  16 Aug 2023 5:16 AM GMT
Chandrababu, Undavalli Sridevi, TDP, APnews

శ్రీదేవి కోసం బాబు స్పెషల్ ప్లాన్ ?

మొన్నటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తాడికొండ నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఉండవల్లి శ్రీదేవి టీడీపీ తీర్థం పుచ్చుకునే పనిలో పడ్డారు. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర తాడికొండకు చేరుకోవడం కీలక మలుపు తిరిగింది. ఈ సందర్భంగా అమరావతి రైతులతో లోకేష్ మాట్లాడుతుండగా.. శ్రీదేవి హాజరు కావడం విశేషం. టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపించిన ఆమె, వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి లాభం చేకూర్చేందుకే క్రాస్ ఓటింగ్ చేశారన్న ఆరోపణలతో శ్రీదేవిని వైసీపీ సస్పెండ్ చేసింది.

ఆమె టీడీపీలో చేరడాన్ని పరిగణనలోకి తీసుకున్న చంద్రబాబు నాయుడు కొన్ని షరతులు పెట్టినట్లు సమాచారం. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాడికొండ నుంచి టీడీపీ తరపున పోటీ చేసేందుకు శ్రీదేవి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రత్యామ్నాయంగా పత్తికొండ నియోజకవర్గానికి పోటీ చేయాలనే సూచన కూడా ఆమెకు అందింది. ఇదిలావుండగా.. తాడికొండ టీడీపీ టికెట్‌ మాజీ ఎమ్మెల్యే శ్రవణ్‌కుమార్‌కు ఇప్పటికే ఖరారైనట్లు సమాచారం. పత్తికొండలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామాంజనేయులుకు అవకాశం కల్పించే ఆలోచనలో బాబు ఉండటం గమనార్హం.

ఈ నేపథ్యంలో బాపట్ల లోక్ సభ నియోజకవర్గానికి శ్రీదేవికి స్థానం కల్పించే అవకాశాలను బాబు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యూహంలో ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ ఎంపీ నందిగాం సురేష్‌పై శ్రీదేవి పోటీ పడవచ్చు. అయితే ఈ ఫలితం అనిశ్చితంగానే కనిపిస్తోంది. శ్రీదేవి ఈ ప్రతిపాదనను అంగీకరిస్తుందా లేదా? అనేది మున్ముందు తెలుస్తుంది. మరోవైపు టీడీపీ శ్రేణులు శ్రీదేవిపై గుర్రుగా ఉన్నాయి. టీడీపీ యువ నాయ‌కుడు నారా లోకేశ్ ఆమెకి అధికార ప్రాధాన్యం ఇవ్వ‌డంపై బాబు సామాజిక వ‌ర్గేతరులు ఆగ్ర‌హాంతో ఉన్నారు. శ్రీ‌దేవికి టీడీపీ టికెట్ ఇస్తే, ఆమెకు వ్య‌తిరేకంగా మ‌రో టీమ్ త‌యార‌య్యే ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

Next Story