తెలంగాణలో పొత్తులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడ్డాయి. టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
By Srikanth Gundamalla Published on 29 Aug 2023 5:01 PM ISTతెలంగాణలో పొత్తులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడ్డాయి. ఇప్పటికే అధికార పార్టీ బీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించింది. అప్పుడే ప్రజల వద్దకు వెళ్తున్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూనే ఉన్నారు. ఇక మిగతా పార్టీలు కూడా అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డారు. ఏపీలో టీడీపీ బలంగా ఉంది. కానీ.. తెలంగాణలో ఆ పరిస్థితులు లేవు. టీడీపీని బలోపేతం చేయడానికి అధ్యక్షుడిని మార్చారు. అయితే.. ఎన్నికలు దగ్గరపడ్డ సమయంలో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందనే వార్తలు వచ్చాయి. దాంతో.. టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరిగానే బరిలోకి దిగుతామని చంద్రబాబు చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు.. అక్కడే చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. అంతేకాదు.. ఈసారి ఎవరితోనూ పొత్తులు ఉండబోవని స్పష్టం చేశారు. పొత్తుల వ్యవహారంలో బీజేపీతో కలిసి వెళ్లడానికి సమయం మించిపోయిందని చెప్పారు. అయితే.. తెలంగాణలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఎవరు ఏ స్థానంలో పోటీ చేస్తారు? ఎన్ని స్థానాల్లో పోటీ చేయడంపై కమిటీ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. ఏపీని ఎలా పునర్నిర్మించాలన్న ఆలోచనలో తాను ఉన్నట్లు.. బీజేపీతో అంతర్గతంగా ఏం చర్చిస్తున్నామనేది ఎవరికీ తెలియదని అన్నారు.