కేసీఆర్‌ బాటలో చంద్రబాబు.. రెండు చోట్ల పోటీ!

చంద్రబాబు.. కేసీఆర్‌ తరహాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

By అంజి  Published on  31 Aug 2023 5:45 AM GMT
Chandra Babu Naidu, KCR, contest two seats, APnews

కేసీఆర్‌ బాటలో చంద్రబాబు.. రెండు చోట్ల పోటీ!

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తరహాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నారా? అంటే.. ఆంగ్ల మీడియాలోని ఓ విభాగంలో ప్రచురితమైన ఊహాజనిత నివేదిక ప్రకారం అవుననే సమాధానం వస్తోంది. ఓడిపోకుండా ఉండేందుకు గజ్వేల్‌తో పాటు కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చంద్రబాబుని కూడా అలాంటి నిర్ణయం తీసుకోవడానికి ప్రేరేపించిందని నివేదిక పేర్కొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా గజ్వేల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో కేసీఆర్ అభివృద్ధి చేసినప్పటికీ, అధికార వ్యతిరేకత పెరిగిపోతున్న నేపథ్యంలో రిస్క్ చేయకూడదనే ఉద్దేశంతో కామారెడ్డి నుంచి పోటీకి దిగారు.

అదే విధంగా దశాబ్దాలుగా కుప్పం చంద్రబాబుకు కంచుకోటగా ఉంటూ వచ్చే ఎన్నికల్లో సీటును నిలబెట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. కుప్పంలో ఏ చిన్నా తేడా జరిగినా ఆయనకు, పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. అందుకే బాబు రిస్క్ చేయకూడదని అనుకుంటున్నారు. కుప్పంలో చంద్రబాబును ఓడించాలని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతం విజయం సాధించి కుప్పంలో చంద్రబాబు ప్రాబల్యాన్ని అధికార పార్టీ మట్టికరిపించింది. 2019 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కుప్పంలో వైఎస్‌ఆర్‌సి తన పునాదిని బలోపేతం చేసుకుంది. టీడీపీ అధినేతను ఓడించేందుకు చంద్రబాబుకు చిరకాల ప్రత్యర్థి వైఎస్సార్సీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంపైనే కాన్సంట్రేషన్ చేస్తున్నారు. ఆయన సొంత నియోజకవర్గం పుంగనూరు కంటే కుప్పంపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.

అందుకే, కుప్పాన్ని నిలుపుకునేందుకు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తూనే, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మరో సురక్షిత నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. ఈ రెండు జిల్లాల్లో సురక్షితమైన సీటు కోసం చూడాలని ఆయన తన పార్టీ నేతలను కోరినట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు తిరుపతికి మారి తనయుడు నారా లోకేష్‌ని కుప్పం నుంచి పోటీకి దింపుతారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ లోకేష్ మాత్రం మంగళగిరిని ఎంచుకుని ఓడిపోయారు. ప్లాన్ వర్కవుట్ అయితే చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ గుంటూరు జిల్లాలోని పక్క నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. సీనియర్ నేతలు రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయడం కొత్త కాదు. అయితే చంద్రబాబుకు మాత్రం రెండు చోట్ల పోటీ చేయడం ఇదే తొలిసారి.

Next Story