ఎంతో ఆసక్తిని రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఓట్ల లెక్కింపు జరుగుతున్న తీరుపై భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అసంతృప్తిని వ్యక్తం చేసింది. కౌంటింగ్ మందకొడిగా సాగుతుండడంతో పాటు రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జరుగుతున్న జాప్యంపై మండిపడింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేశారు. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు ఫలితాలను ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించారు.
ఈసీ తీరు అనుమానాస్పదం : బండి సంజయ్
ఈసీ తీరు అనుమానాస్పదంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్ ఆధిక్యం కనబరచిన రౌండ్ల ఫలితాలను అప్పటికప్పుడే వెల్లడిస్తున్న అధికారులు బీజేపీ ఆధిక్యం సాధించిన రౌండ్ల ఫలితాలను మాత్రం ఆలస్యంగా విడుదల చేస్తున్నారని ఆరోపించారు. మొదటి రెండు రౌండ్ల తరువాత మూడు, నాలుగు రౌండ్ల ఫలితాలను అప్‌డేట్ చేసేందుకు గల జాప్యానికి గల కారణాలు ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఫలితాల విషయంలో ఏ మాత్రం పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని బండి సంజయ్ అన్నారు.