బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లో చేరిన గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు

లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  29 April 2024 11:55 AM IST
brs, telangana, politics, amit,  congress,

బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లో చేరిన గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు 

లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. పలువురు నాయకులు పార్టీకి గుడ్‌బై చెబుతూ మరో పార్టీలో చేరుతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్‌ తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత ఎక్కువ మంది నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడు గుత్తా అమిత్‌ రెడ్డి బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పారు.

లోక్‌సభ ఎన్నికల ద్వారా గట్టిగా కమ్‌బ్యాక్‌ ఇవ్వాలని గులాబీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే జోరుగా ఆయనే ప్రచారంలో పాల్గొంటున్నారు. బస్సు యాత్ర చేపట్టి ఎక్కువ సీట్లను కైవసం చేసుకునేలా వ్యూహాలను రచిస్తున్నారు. ప్రజల్లో మమేకం అవుతూ సభలు.. ర్యాలీలు చేపడుతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రలో ఉండగానే మరో వికెట్ పడిపోయింది. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడు అమిత్‌ కారు దిగిపోయారు. ఏఐసీసీ ఇంచార్జ్‌ దీపాదాస్‌ దున్షీని కలిశారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థాన్ని పుచ్చుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి గుత్తా అమిత్‌కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దాంతో.. రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలినట్లు అయ్యింది.

ఇటీవల గుత్తా సుఖేందర్‌రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీపై ధిక్కార స్వరం వినిపించారు. కేసీఆర్, నాయకుల తీరును తప్పు బడుతూ కామెంట్ చేశారు. ఎన్నికలకు ముందు కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించాననీ.. ఆరు నెలల పాటు తిరిగినా లాభం లేదని అన్నారు. తనకే ఇలాంటి పరిస్థితి ఉంటే మిగతా వారి పరిస్థితి ఏంటన్నట్లుగా మాట్లాడారు. ఓటమిపై ఇప్పటికీ సమీక్ష చేయపోవడం ఏంటోనని గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా మాట్లాడటంతో ఆయన కారు దిగిపోతారని అంతా అనుకున్నారు. కానీ.. ఇటీవల ఆయన ఆ వార్తలను కొట్టిపాడేశారు. కానీ.. గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు అమిత్‌ మాత్రం సైలెంట్ గా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్ అయ్యింది.

Next Story