బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రాజయ్య కాంగ్రెస్‌లో చేరే అవకాశం!
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న రాజకీయ వాతావరణం వెడేక్కుతోంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రాజయ్య కాంగ్రెస్‌లో చేరే అవకాశం కనిపిస్తోంది.
By అంజి Published on 5 Sep 2023 2:41 AM GMTబీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రాజయ్య కాంగ్రెస్‌లో చేరే అవకాశం!
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న రాజకీయ వాతావరణం వెడేక్కుతోంది. ఇప్పటికే అధికార బీఆర్‌ఎస్ పార్టీ.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలను బరిలోకి దింపింది. కేసీఆర్ అభ్యర్థుల జాబితాను ప్రకటించగా.. కొందరు సిట్టింగ్‌లకు మళ్లీ అవకాశం దక్కలేదు. దీంతో సదరు సిట్టింగ్‌లు పార్టీ అధిష్టానంపై ఆగ్రహంతో ఉండగా.. మరికొందరు నేతలు ఇతర పక్క పార్టీల తీర్థం పుచ్చుకుంటున్నారు. తాజాగా సీటు నిరాకరించిన బీఆర్‌ఎస్ స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సోమవారం హన్మకొండలోని ఓ హోటల్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజ నరసింహను కలిశారు. వీరి భేటీ పొలిటికల్‌గా హాట్ టాపిక్‌గా మారింది.
ఘన్‌పూర్ బీఆర్ఎస్ సీటుకు ఎమ్మెల్సీ కడియం శ్రీహరిని ఎంపిక చేసింది. దీంతో రాజయ్య.. కడియం మధ్య మాటల యుద్ధమే జరుగుతోంది. సమయం దొరికిన ప్రతీ సందర్భంలో కడియంపై రాజయ్య తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈసారి టికెట్ నిరాకరించడంతో రాజయ్య బీఆర్‌ఎస్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు రాజయ్య తన రాజకీయ ఎత్తుగడలను ప్రారంభించిన్నట్టు తెలుస్తోంది. స్టేషన్ ఘన్‌పూర్ సీటు కోసం పోటీలో ఉన్న తన క్యాడర్‌కు భరోసా ఇచ్చాడని సమాచారం. ఆయన భవిష్యత్ కార్యాచరణలో భాగంగా నమిండ్ల శ్రీనివాస్‌తో పాటు రాజ నరసింహతో భేటీ కావడం విశేషం.
45 నిమిషాలపాటు జరిగిన చర్చల అనంతరం రాజయ్య కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని తెలిసింది. అయితే వారిద్దరూ ఈ పరిణామాన్ని ధృవీకరించలేదని వర్గాలు తెలిపాయి. అంతకు ముందు పాలకుర్తిలోని వల్మిడిలో శ్రీ సీతా రామచంద్ర స్వామి విగ్రహాల పునఃప్రతిష్ఠాపన సందర్భంగా రాజయ్య, శ్రీహరి కలిశారు. కరచాలనం చేసి ఒకరికొకరు కూర్చున్నారు. శ్రీహరి సభను ఉద్దేశించి ప్రసంగించబోతుండగా, రాజయ్య అక్కడి నుండి బయలుదేరి నేరుగా రాజ నరసింహను కలిశాడు. దీంతో కాంగ్రెస్‌లో చేరేందుకే దామోదరతో భేటీ అయినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.