బీజేపీ, కాంగ్రెస్‌లకు తెలంగాణలో ఓటు అడిగే హక్కులేదు: మల్లారెడ్డి
మాజీమంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి బీజేపీ, కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 27 March 2024 9:08 AM GMTబీజేపీ, కాంగ్రెస్‌లకు తెలంగాణలో ఓటు అడిగే హక్కులేదు: మల్లారెడ్డి
లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఇక తెలంగాణలో రాజకీయ పార్టీలు ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థులను పూర్తిగా ఖరారు చేసి ప్రకటన చేసింది. ఇక మిగతా పార్టీలు అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేశాయి. పెండింగ్‌లో ఉన్న స్థానాలపై కసరత్తు చేస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇన్నాళ్లు బీఆర్ఎస్‌ను వీడుతారని ప్రచారం జరిగిన మాజీమంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి బీజేపీ, కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. బుధవారం బీఆర్ఎస్ నిర్వహించిన మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్యనేతల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు లోక్‌సభ ఎన్నికల్లో తాము గెలుస్తామంటే.. తాము గెలుస్తామని చెప్పుకుంటున్నాయని అన్నారు. కానీ.. తెలంగాణకు ఈ రెండు జాతీయ పార్టీలు చేసిందేమిటో చెప్పడం లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు తెలంగాణలో ప్రజలను ఓటు అడిగే హక్కు లేదని మల్లారెడ్డి విమర్శించారు. ఏం చేశారని ఏ ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగున్నారో చెప్పాలని మల్లారెడ్డి డిమాండ్ చేశారు.
ఇన్నాళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీలు దేశ ప్రజలను మొత్తం మోసం చేశాయని మల్లారెడ్డి ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేశామా అని తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. అసలు బీజేపీ, కాంగ్రెస్‌లకు తెలంగాణలో ఓటు బ్యాంకే లేదన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే బాగుండని ప్రజలు అనుకుంటున్నారని మాజీమంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు.
బీజేపీ, కాంగ్రెస్‌లకు ఓటు అడిగే హక్కులేదు: బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి pic.twitter.com/acKOp0ek8G
— Newsmeter Telugu (@NewsmeterTelugu) March 27, 2024