సీఎం రేవంత్‌రెడ్డిలో అసహనం కనిపిస్తోంది: కడియం శ్రీహరి

సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర విమర్శలు చేశారు.

By Srikanth Gundamalla  Published on  28 Feb 2024 1:44 PM IST
brs, mla kadiyam srihari, comments,  cm revanth reddy, telangana,

సీఎం రేవంత్‌రెడ్డిలో అసహనం కనిపిస్తోంది: కడియం శ్రీహరి 

సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం వరంగల్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి వేదిక ఏదైనా సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని అన్నారు. ఆయన భాష జిగుప్సాకరంగా ఉందన్నారు. రేవంత్‌రెడ్డి భాష తీరు అస్సలు సరిగ్గా లేదన్నారు. ఆయన భాషను ఖండిస్తున్నామన్నారు కడియం శ్రీహరి. కేసీఆర్‌ పాలనలో తెలంగాణ దేశానికే రోల్‌ మోడల్‌గా ఉందని గుర్తు చేశారు స్టేషన్ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి.

సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి సవాల్ విసిరారు. కాంగ్రెస్ మేనిఫెస్టో.. బీఆర్ఎస్‌ మేనిఫెస్టోపై చర్చకు రెడీ అని కడియం చాలెంజ్‌ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చాలు మాటల దాడి చేస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి భయం మొదలైందని.. ఎందుకు ఆయన భయపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. రాజకీయాల్లో మగతనం మాట ఎందుకు వస్తోందని కడియం శ్రీహరి ప్రశ్నించారు. మహిళా నాయకుల నాయకత్వంలో పనిచేస్తూ నువ్వు మగతనం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. అంత మగాడివి అయితే.. తెలంగాణలో 17 ఎంపీ స్థానాల్లో గెలిచి మగతనాన్ని నిరూపించుకోవాలని కడియం శ్రీహరి అన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చాలనే ఆలోచన తమకు అస్సలు లేదన్నారు కడియం శ్రీహరి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దానంతట అదే కూలిపోతే తమకు సంబంధం లేదన్నారు. కాంగ్రెస్‌ వారితోనే సీఎం రేవంత్‌రెడ్డి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రేవంత్‌రెడ్డికి సీఎం కుర్చీ ఇనాం కింద వచ్చిందనే అనుకుంటున్నామని వ్యాఖ్యానించారు. ఇక మార్చి 1వ తేదీన బీఆర్ఎస్‌ నేతలం కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు వెళ్తున్నామనీ.. త్వరలోనే కేసీఆర్ కూడా మేడిగడ్డకు వస్తారని కడియం శ్రీహరి చెప్పారు.

Next Story