ఎమ్మెల్యేలను లాక్కునే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్: హరీశ్‌రావు
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 15 March 2024 1:43 PM ISTఎమ్మెల్యేలను లాక్కునే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్: హరీశ్‌రావు
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల ఎమ్మెల్యేలు, ఇతర నాయకులను లాక్కునే ప్రయత్నాలు కాంగ్రెస్ తీవ్రంగా చేస్తోందని ఆరోపించారు. ప్రజలకు సేవ చేయడం కంటే ప్రతిపక్షాలను వేధించడంపైనే ఎక్కువ దృష్టి పెట్టిందని ఆరోపించారు హరీశ్‌రావు. కాంగ్రెస్‌లో చేరకపోతే వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. ఈ వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు.
పటాన్‌చెరు మండలం లక్డారంలో మైనింగ్‌కు అనుమతులు ముగిసినా పనులు చేస్తున్నారని ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనను గాలికి వదిలేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులు పెట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులను లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆరోపించారు. వందల మంది పోలీసులు వెళ్లి వేకువజామున మధుసూదన్‌రెడ్డిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటంటూ హరీశ్‌రావు ప్రశ్నించారు. ఎఫ్‌ఐఆర్ కాపీ ఇవ్వకుండానే అరెస్ట్ చేశారని చెప్పారు.
అధికారం ఎవరికీ శాశ్వతం కాదనీ.. ఈ విషయం పోలీసులు గమనించాలంటూ హరీశ్‌రావు సూచించారు. ఏదో విధంగా బీఆర్ఎస్ నాయకులపై నిందారోపణలు వేసి జైలుకు పంపాలని చూస్తున్నారంటూ హరీశ్‌రావు చెప్పారు. బెదిరించి లొంగదీసుకుని కాంగ్రెస్‌లో చేర్చుకోవాలని చూస్తే ఆ పార్టీకే మంచిది కాదని చెప్పారు. ఇక మంత్రి ఆదేశాలతోనే దాడులు చేస్తున్నామని స్వయంగా ఆర్డీవో చెప్పారని గుర్తు చేశారు. ఈ విషయంలో న్యాయ పోరాటం చేస్తామని మాజీమంత్రి హరీశ్‌రావు చెప్పారు. ప్రజాకోర్టులో కాంగ్రెస్‌కు తగిన శిక్ష పడుతుందని అన్నారు.