Telangana: తొలి ఏడాదే 2లక్షల ఉద్యోగాలన్నారు.. ఎక్కడ?: కేటీఆర్
ఇల్లందు నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.
By Srikanth Gundamalla Published on 20 May 2024 1:45 PM ISTTelangana: తొలి ఏడాదే 2లక్షల ఉద్యోగాలన్నారు.. ఎక్కడ?: కేటీఆర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు మాట్లాడుతోందంటూ కేటీఆర్ ఆరోపించారు. కేసీఆర్ గతంలో ఇచ్చిన ఉద్యోగాలను సిగ్గులేకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తామే ఇచ్చామని చెప్పుకుంటోందని కేటీఆర్ మండిపడ్డారు.
నోరు తెరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలనే చెబుతోందని.. ఈ మేరకు విద్యావంతులు ప్రభుత్వం వ్యవహారాన్ని గుర్తించి సరైన బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పినట్లు గుర్తించారు. ఇప్పటి వరకు ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కానీ.. 30 వేల ఉద్యోగాలు ఇచ్చామనీ చెబుతున్నారనీ.. ఉద్యోగం ఇవ్వాలంటే నోటిఫికేషన్.. పరీక్ష.. ఇంటర్వ్యూ నియామక పత్రాలు ఇలా ఒక ప్రాసెస్ ఉంటుందనీ.. వీటిలో ఏ ఒక్కటైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందా అని కేటీఆర్ నిలదీశారు. నిరుద్యోగులను మోసం చేయడానికి మరోసారి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డికి బుద్ధి చెప్పాలంటే.. 2 లక్షల ఉద్యోగాలు నెరవేరాలంటే.. ప్రభుత్వాన్ని నిలదీసే రాకేశ్ రెడ్డిని శాసనండలికి పంపించాలని ఈ సందర్బంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజులే లేకుండా ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పారని కేటీఆర్ తెలిపారు. కానీ.. గతంలో రూ.400 టెట్ దరఖాస్తు ఫీజు ఉంటే.. దాన్ని వెయ్యికి పెంచారని అన్నారు. ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధిచెప్పాలన్నారు.