పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలు.. బుజ్జగిస్తోన్న బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్
తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి గడ్డుకాలం నడుస్తోంది.
By Srikanth Gundamalla Published on 26 Jun 2024 8:15 AM ISTపార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలు.. బుజ్జగిస్తోన్న బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్
తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి గడ్డుకాలం నడుస్తోంది. ఇక లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం ఆ పార్టీని మరింత దెబ్బతీసింది. దాంతో. ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా గుడ్‌బై చెబుతున్నారు. ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌ను వీడారు. దీంతో.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. దిద్దుబాటు చర్యలను ప్రారంభించారు.
ఉమ్మడి జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌజ్‌కు పిలిపించుకుని బుజ్జగిస్తున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు గ్రేటర్ మైదరాబాద్‌లోని ఎమ్మెల్యేలు, ఎమెల్సీలతో దాదాపు 4 గంటల పాటు సమావేశం అయ్యారు. మాజీ మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, మాధవరం కృష్ణారావు, ముఠా గోపాల్, టి.ప్రకాశ్ గౌడ్, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, దండే విఠల్ సహా మరికొందరు నాయకులు ఉన్నారు. దానం నాగేర్ పార్టీ మారినప్పుడు తాము సీరియస్‌గా తీసుకోలేదనీ.. కానీ సీనియర్ నేతలు కడియం, పోచారం శ్రీనివాస్‌రెడ్డి కూడా పార్టీ వీడటాన్ని తట్టుకోలేకపోతున్నామని పలువురు నేతలు కేసీఆర్‌తో చెప్పినట్లు తెలుస్తోంది.
పోచారం శ్రీనివాస్‌రెడ్డి పార్టీ వీడటాన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నారు. వైఎస్ హయాంలో ఇలాంటి కూడా ఇలాంటివి జరిగాయనీ.. కుంగిపోలేదని చెప్పినట్లు తెలిసింది. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలమైందని కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నదని చెప్పారు. భవిష్యత్‌లో మళ్లీ మనకు అధికారం ఖామయని కేసీఆర్ దీమాగా చెప్పినట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ నుంచే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారనే ప్రచారం జరుగుతోందనీ.. ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటాననీ.. పార్టీని ఎవరూ వీడొద్దని కేసీఆర్ బుజ్జగించినట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాల వారీగా అందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీలు జరుపుతానని కేసీఆర్ పార్టీ నేతలతో చెప్పారని తెలిసింది.