అవును ల్యాండ్‌ క్రూజర్లు కొన్నాం.. మంత్రులకు కడియం కౌంటర్

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం, బీఆర్ఎస్‌ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది.

By Srikanth Gundamalla  Published on  30 Dec 2023 7:06 AM IST
brs, kadiyam srihari, 22 cars, congress, telangana,

అవును ల్యాండ్‌ క్రూజర్లు కొన్నాం.. మంత్రులకు కడియం కౌంటర్

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం, బీఆర్ఎస్‌ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. శ్వేతపత్రం, స్వేదపత్రం పేరుతో రాజకీయాలు హీట్‌ ఎక్కాయి. గత పదేళ్లలో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం దుబారా ఖర్చులు చేసిందనీ.. అవినీతికి పాల్పడిందని సీఎం రేవంత్‌రెడ్డితో పాటు.. కాంగ్రెస్‌ మంత్రులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు బీఆర్ఎస్‌ 22 ల్యాండ్‌ క్రూజర్ కార్లను కొనుగోలు చేశారని చెప్పారు సీఎం రేవంత్‌రెడ్డి. డబ్బులు వృథా చేశారంటూ మండిపడ్డారు. తాజాగా ఇదే అంశంపై బీఆర్ఎస్‌ మాజీ మంత్రి కడియం శ్రీహరి స్పందించారు. బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు.

అవును బీఆర్ఎస్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు 22 ల్యాండ్ క్రూజర్‌ కార్లను కొనుగోలు చేసిందని స్పష్టం చేశారు కడియం శ్రీహరి. అందులో తప్పేముందని ప్రశ్నించారు. ఇందులో అవినీతి ఏమైనా జరిగిందా అని కాంగ్రెస్ మంత్రులను నిలదీశారు. ప్రగతి భవన్‌ను ఆస్పత్రి చేస్తామని చెప్పారు.. ఇప్పుడు అందరు ఎవరు ఉన్నారని మంత్రులను ప్రశ్నించారు. కాంగ్రెస్ మంత్రలు కాళేశ్వరం సందర్శన కోసం వెళ్లి అక్కడ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారని అన్నారు. ఆరు గ్యారెంటీల అమలులో ఆర్థిక వనరులను సమకూర్చుకోలేకే జనాన్ని మభ్యపెట్టేందుకు కొత్త డ్రామాలకు తెర లేపారని కాంగ్రెస్ సర్కార్‌పై కడియం శ్రీహరి విమర్శలు చేశారు.

రూ.93వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎలా జరిగిందో వివరించాలని కాంగ్రెస్‌ సర్కార్‌ను కోరారు కడియం. అన్ని అనుమతులు తీసుకున్నాకే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని చెప్పారు. అంచనాలు పెంచడానికి కారణాలను కూడా ఆయన తెలిపారు. మూడు బ్యారేజీలు, పవర్‌ జెనరేట్ ప్రాజెక్టులు, సబ్‌స్టేషన్లు, లిఫ్ట్‌లు ఏర్పాటు చేయడంతో అంచనాలు పెరిగాయని అన్నారు. అయితే. మేడిగడ్డ వద్ద 19 20, 21 పిల్లర్లు కుంగడం దురదృష్టకరమన్న కడియం శ్రీహరి.. దీనిపై పూర్తి విచారణ చేయాలని కోరారు. చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. అలాగే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావాలని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. ఇందుకు బీఆర్ఎస్ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.


Next Story