హామీలు అమలు చేస్తేనే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లడగాలి: హరీశ్‌రావు

తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్‌ బీఆర్ఎస్ నాయకుల మధ్య వార్ నడుస్తోంది.

By Srikanth Gundamalla  Published on  6 March 2024 5:30 PM IST
brs, harish rao, comments,  telangana, congress government ,

హామీలు అమలు చేస్తేనే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లడగాలి: హరీశ్‌రావు

తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్‌ బీఆర్ఎస్ నాయకుల మధ్య వార్ నడుస్తోంది. హామీల కోసం బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తుంటే.. గతంలో అధికారంలో ఉండగా అవినీతికి పాల్పడ్డారంటూ మంత్రులు, కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వంద రోఉల్లో అమలు చేస్తేనే ఆ పార్టీకి ఓట్లు అడిగే హక్కు ఉంటుందని చెప్పారు. కొద్ది రోజుల్లోనే లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హరీశ్‌రావు ఈ వ్యాఖ్యలు చేశారు.

మాజీ మంత్రి హరీశ్‌రావు బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి వంద రోజుల పాలనపై రైతులు ఓట్లు వేయాలని అన్నారు. ఎన్నికల వేళ కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు డిసెంబర్ నుంచే రూ.4వేల పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. నోటరీ కూడా రాసి మాట తప్పారంటూ హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. ఇప్పుడు ఎవరిపై కేసు పెట్టాలో చెప్పాలన్నారు. జనవరిలో ఎవరికీ పెన్షన్ అందలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రుణమాఫీ, రైతుబంధు, విద్యుత్, ధాన్యానికి బోనస్ ఇవ్వలేదని విమర్శలు చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.. కరవు తెచ్చిందనే చర్చ జరుగుతోందని అన్నారు. ఇక ఎల్‌ఆర్‌ఎస్‌ గురించి ప్రస్తావించిన హరీశ్‌రావు.. ఉచితంగా అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు ముక్కు పిండి డబ్బులు వసూలు చేసేందుకు సిద్ధం అవుతారా? అని ప్రశ్నించారు. నిరుద్యోగ భీథి రూ.4వేలు ఇస్తామని ఇవ్వడం లేదన్నారు. 200 యూనిట్ల ఫ్రీ కరెంటు ఇస్తామని చెప్పి.. తాజాగా నిబంధనలు పెట్టి ప్రజలను మోసం చేస్తారా అని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీశారు. దళితబంధు కూడా రూ.12 లక్షలు ఇస్తామని చెప్పి దాని ఊసే ఎత్తడం లేదన్నారు.

Next Story