కర్ణాటకలో కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించింది: హరీశ్‌రావు
మంత్రి హరీశ్‌రావు తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 17 Nov 2023 12:13 PM ISTకర్ణాటకలో కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించింది: హరీశ్‌రావు
తెలంగాణలో ఈ నెల 30వ తేదీన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలోనే విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ నుంచి జాతీయ నాయకులు తెలంగాణకు వచ్చి అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొంటున్నారు. బీఆర్ఎస్ సర్కార్‌పై విమర్శలు చేస్తున్నారు. అయితే.. బీఆర్ఎస్ కూడా ఆ పార్టీలకు తగిన రీతిలోనే కౌంటర్లు వేస్తోంది. దాంతో.. రాష్ట్ర రాజకీయాల్లో వేడి పెరుగుతోంది.
తాజాగా మంత్రి హరీశ్‌రావు తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్‌కు ఓటేసిన ప్రజలకు ఏ పథకం అందడం లేదన్నారు. ఖజానా ఖాళీ అయ్యిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా చెబుతున్నారని చెప్పారు. కర్నాటక మోడల్ అని చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేయాలని ఆ పార్టీ నేతలు కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపించారు. అయితే.. కర్ణాటకలోనే ఐదు గ్యారెంటీలను అమలు చేయలేని వారు.. తెలంగాణలో ఆరు గ్యారెంటీలు ఎలా అమలు చేస్తారని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ నేతలు అరచేతిలో వైకుంఠం చూపించారనీ.. వారి మాటలు నమ్మి ఓటేసిన ప్రజలు ఇప్పుడు నిత్యం నరకం అనుభవిస్తున్నారని అన్నారు.
కర్ణాటకలో శక్తి పథకంలో శక్తి లేదు అనీ.. గృహలక్ష్మి పథకంలో లక్ష్మి లేదు అనీ.. అన్నభాగ్య పథకంలో అన్నం లేదంటూ మంత్రి హరీశ్‌రావు విమర్శలు చేశారు. ఢిల్లీ పార్టీలను నమ్ముకుంటే ఎప్పటికైనా మోసపోతామని హెచ్చరించారు. నిధులలేమితో కర్ణాటకలో విద్యార్థుల స్కాలర్‌షిప్పులు తగ్గిస్తున్నారని చెప్పారు. దాంతో ఉన్నత విద్య చదువుతున్న తల్లిదండ్రులపై భారం పడుతోందన్నారు మంత్రి హరీశ్‌రావు. అందుకే ఓటు వేసే ముందు యువత ఒకసారి ఆలోచించాలన్నారు. కర్ణాటకలో ఆరునెలల్లోనే 350 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారనీ.. ట్రాన్స్‌ఫార్మర్లు లేక రైతులు అల్లాడిపోతున్నారని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఒక్క చాన్స్ అని.. అధికారంలోకి వచ్చాక పట్టించుకోరంటూ మంత్రి హరీశ్‌రావు తీవ్ర విమర్శలు చేశారు.