సీఎం రేవంత్ పరుష పదజాలంతో పాలన సాగదు: హరీశ్‌రావు
టీడీపీ, కాంగ్రెస్‌లపై బీఆర్ఎస్ మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 7 March 2024 3:25 PM ISTసీఎం రేవంత్ పరుష పదజాలంతో పాలన సాగదు: హరీశ్‌రావు
టీడీపీ, కాంగ్రెస్‌లపై బీఆర్ఎస్ మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు పాపాలు, కాంగ్రెస్ పార్టీ లోపాలే పాలమూరు పాలిట శాపాలుగా మారాయని అన్నారు. పాలమూరు నుంచి వలసలు వెళ్లడానికి కారణం ఈ రెండు పార్టీలే కారణమని హరీశ్‌రావు ఆరోపించారు.
పాలమూరు వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు హరీశ్‌రావు చెప్పారు. మహబూబ్‌నగర్ వెనుకబాటుతనానికి కారణం నాటి టీడీపీ, కాంగ్రెస్ పాలనే కారణమన్నారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి తిట్టాల్సి వస్తే చంద్రబాబునే అనాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందనీ.. వారిని నిందించాలని సూచించారు. గత పాలకులు ప్రాజెక్టుల పేర్లు మార్చారు తప్ప పనులు చేయలేదని విమర్శించారు. కానీ.. బీఆర్ఎస్ పాలనలో పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చామని చెప్పారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చిన కేసీఆర్‌ను తిడితే ఊరుకునేది లేదన్నారు. ఇక సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడే భాషతో, పరుష పదజాలంతో పరిపాలన సాగదు అని చెప్పారు. ప్రతిపక్ష పాత్రలో ఉన్నట్లుగా రెచ్చగొట్టి మాట్లాడటం సరికాదని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి మహబూబ్‌నగర్ ప్రజలను రెచ్చగొట్టి లబ్ధిపొందాలని చూస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. పాలమూరు కరవుతో రాజకీయాలు చేసింది కాంగ్రెస్, టీడీపీలే అని చెప్పారు. కల్వకుర్తి, బీమా, నెట్టంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టును నాడు కాంగ్రెస్ ఎందుకు పూర్తి చేయలేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. వలసలు, రైతు ఆత్మహత్యలకు కారణమైనది కాంగ్రెస్సే అన్నారు. వాస్తవాలు కప్పిపెట్టి కేసీఆర్‌పై దాడి చేస్తామంటే ఊరుకునేది లేదన్నారు. పాలమూరు ప్రాజెక్టు ఇప్పటికే 80 శాతం పూర్తయ్యిందనీ.. కాల్వలను పూర్తి చేసి నీళ్లు ఇవ్వాలని మాజీమంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు.