లోక్‌సభ ఎన్నికలపై BRS ఫోకస్.. బరిలోకి కేటీఆర్..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు పరాభవం ఎదురైంది.
By Srikanth Gundamalla Published on 7 Jan 2024 9:39 AM ISTలోక్‌సభ ఎన్నికలపై BRS ఫోకస్.. బరిలోకి కేటీఆర్..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు పరాభవం ఎదురైంది. తాము అనుకున్నట్లుగా ఫలితాలు అస్సలు రాలేదు. అధికారంలోకి వస్తామని దీమా ఉంటే.. ఊహించని రీతిలో సీట్లు తగ్గిపోయాయి. అయితే.. కొద్ది నెలల్లోనే లోక్‌సభ ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధిష్టానం సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం అవుతోంది. గత ఎన్నికల్లో అనుభవాలను దృష్టిలో పెట్టుకుని.. ఈ సారి ముందుకు రావాలని చూస్తోంది. దాంతో.. బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపే ప్రయత్నాలను మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కూడా లోక్‌సభ బరిలో దింపనున్నట్లు తెలుస్తోంది.
కేటీఆర్‌ను లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన సికింద్రాబాద్, లేదా మల్కాజిగిరి నుంచి బరిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే.. ఇదే అంశంపై చర్చ వచ్చినప్పుడు కేటీఆర్ సానుకూలత చూపలేదట. అలా అని లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోను అని కూడా స్పష్టంగా చెప్పలేదట. చివరకు కేసీఆర్ తీసుకునే తుది నిర్ణయంపై కేటీఆర్ లోక్‌సభ ఎన్నికల బరిలో ఉంటారా లేదా అన్నది తేలనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేటీఆర్ లోక్‌సభ బరిలో ఉండే అవకాశాలు ఉన్నాయనీ బీఆర్ఎస్‌లోని ఉన్నతస్థాయి వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిక స్థానాల్లో ఓటమి పాలువ్వడంతో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటోంది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ముఖ్యనేతలతో సమావేశాలు ఏర్పాటు చేస్తోంది. అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటోంది. కాగా.. గత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 17 స్థానాలకు గాను బీఆర్ఎస్ 9 చోట్ల గెలిచింది. 4 చోట్ల బీజేపీ.. కాంగ్రెస్ మూడు స్థానాల్లో గెలిచింది. ఎంఐఎం లోక్సభ స్థానాన్ని దక్కించుకుంది. కాగా.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలో 7 స్థానాలకు గాను ఆరు అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ గెలిచింది. మరొకటి ఎంఐఎం గెలుచుకుంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్‌ను మల్కాజిగిరి నుంచి లేదంటే సికింద్రాబాద్ నుంచి పోటీ చేయించే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.