కేసీఆర్‌ సంచలన నిర్ణయం.. మరో 10 రోజుల్లో అభ్యర్థుల ప్రకటన

తెలంగాణకు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దీంతో రాష్ట్రంలో ఎన్నికల హడావుడి నెలకొంది. రాష్ట్ర సీఎం, భారత రాష్ట్ర సమితి

By అంజి  Published on  25 Jun 2023 12:15 PM IST
BRS, CM KCR, BRS MLA candidates, Telangana, Assembly elections

కేసీఆర్‌ సంచలన నిర్ణయం.. మరో 10 రోజుల్లో అభ్యర్థుల ప్రకటన

తెలంగాణకు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దీంతో రాష్ట్రంలో ఎన్నికల హడావుడి నెలకొంది. రాష్ట్ర సీఎం, భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌.. ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నారు. హ్యాట్రిక్‌ కొట్టడానికి వ్యూహాత్మకంగా రెడీ అవుతున్నారు. తాజాగా కేసీఆర్‌ పార్టీ అభ్యర్థుల ఖరారు విషయమై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితా కూడా రెడీ అయ్యిందట. వారం, 10 రోజుల్లో అభ్యర్థులను ప్రకటించబోతున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. మొత్తం 119 నియోజకవర్గాలకు 119 మంది అభ్యర్థులను బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రకటించబోతున్నారు. గతంలో మాదిరిగానే ఈ సారి కూడా పొత్తులు లేకుండా వెళ్లేందుకు కేసీఆర్‌ తన ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు.

80 నుంచి 90 శాతం వరకు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే అవకాశం ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం. 8 నుంచి 15 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలని మాత్రమే ఈ ఎన్నికల్లో మార్చే అవకాశం ఉంది. సర్వేల ఆధారంగా గులాబీ బాస్‌ కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్షాల ఊహాకు అందని విధంగా కేసీఆర్‌ ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్‌.. నియోజకవర్గాల వారీగా సర్వేలు చేయించుకున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ కంటే ముందే అభ్యర్థులను ప్రకటించేందుకు కేసీఆర్‌ తన్‌ ప్లాన్‌ను రెడీ చేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చనే ఉద్దేశంతోనే.. ముందస్తు జాగ్రత్తగా అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 2018లో కేసీఆర్‌ ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు. ప్రభుత్వ రద్దుతో పాటు అప్పటికప్పుడే ఎన్నికల అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.

మూడు నెలలకు ముందే 105 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేయడం అప్పట్లో సంచలనం రేపింది. ఇప్పుడు కూడా కేసీఆర్‌ అదే రీతిలో అసెంబ్లీ ఎన్నికలకు ముందే అభ్యర్థులను ప్రకటించేలా కేసీఆర్‌ కసరత్తులు చేశారు. ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం వెనుక కేసీఆర్ మాస్టర్‌ ప్లాన్‌ ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో టికెట్ల కోసం బీఆర్‌ఎస్‌లో తీవ్ర పోటీ నెలకొననుంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో పనిమంతులకే టికెట్‌ దక్కుతుందని ఇప్పటికే పార్టీ అధినేత స్పష్టం చేశారు. చివరి నిమిషంలో అభ్యర్థులను ఖరారు చేస్తే అసంతృప్తి ప్రభావం ఎక్కువగా ఉంటుందని, అలాగే ఎన్నికలకు ముందు టికెట్‌ దక్కని వారు తిరుగు బాటు చేసే అవకాశం ఉంటుందన్న నేపథ్యంలో కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

బీఆర్‌ఎస్‌ నుండి ఇతర పార్టీల్లోకి వెళ్లే నేతల జాబితా సిద్ధంగా ఉందని, వారిని వీలైనంత తొందరగా వారిని బుజ్జగించడానికి, అయినా వారు వెళ్లిపోతే పార్టీపై ఎలాంటి ప్రభావం పడకుండా ఉండటానికి కేసీఆర్‌ ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కసరత్తులో ఎన్నికల సంఘం స్పీడు పెంచింది. రాష్ట్ర యంత్రాంగంతో ఎన్నికల సంఘం వరుస భేటీలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే వారం, 10 రోజుల్లో అభ్యర్థులను ప్రకటించి ప్రచారానికి తెరలేపాలనే ఆలోచనలో ఉన్నారు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్.

Next Story