ఎవరు నిజం మాట్లాడుతున్నారో గుర్తించండి.. ఆగం కావొద్దు: సీఎం కేసీఆర్
ఎన్నికలొస్తే ఆగం కావొద్దని, అప్పుడే ధీరత్వం ప్రదర్శించాలని ప్రజలకు బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు.
By అంజి Published on 24 Aug 2023 3:38 AM GMTఎవరు నిజం మాట్లాడుతున్నారో గుర్తించండి.. ఆగం కావొద్దు: సీఎం కేసీఆర్
మెదక్: రైతు అనుకూల విధానాలను అమలు చేయడంలో బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ విఫలమయ్యాయని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు (కెసిఆర్) బుధవారం ఆరోపించారు. ధరణి పోర్టల్‌ను వెనక్కి తీసుకోవాలనే కాంగ్రెస్ ప్రతిపాదనపై కూడా ఆయన మండిపడ్డారు. మెదక్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్, వడ్డీలేని రుణాలు, పంటల బీమాతో పాటు అనేక రైతు అనుకూల విధానాలను రూపొందించిందన్నారు. బీజేపి ప్రభుత్వం వ్యవసాయ భూముల్లో స్మార్ట్ పవర్ మీటర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్రాలను ఒత్తిడి చేస్తోందని, దీనివల్ల రూ.25 వేల కోట్లు వృథా అవుతుందన్నారు.
కర్ణాటక ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని కేసీఆర్ కూడా కాంగ్రెస్‌ను టార్గెట్ చేశారు. కాంగ్రెస్ కర్నాటకలో రైతులకు 7 గంటల కరెంట్ మాత్రమే ఇస్తోందని, తెలంగాణలో 24 గంటల పాటు కోతల్లేని కరెంటు ఇస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎవరు నిజం మాట్లాడుతున్నారో, ఎవరు కాదో ప్రజలు అంచనా వేయాలని, అన్ని పార్టీల గత పనితీరును పునరాలోచించుకోవాలని ఆయన అన్నారు. ఎన్నికలొస్తే ఆగం కావొద్దని, అప్పుడే ధీరత్వం ప్రదర్శించాలని ప్రజలకు సూచించారు.
ఈ సమావేశంలో మెదక్ జిల్లాకు పలు అభివృద్ధి కార్యక్రమాలను కేసీఆర్ ప్రకటించారు. ఇందులో రామాయంపేట రెవెన్యూ డివిజన్, రోడ్ల పునర్ అభివృద్ధికి నిధులు, రామాయంపేట, కౌడిపల్లికి ఒక్కో డిగ్రీ కళాశాల, మెదక్ చుట్టూ రింగురోడ్డు, ఏడుపాయల దేవాలయం వద్ద పర్యాటక అభివృద్ధికి రూ.100 కోట్లు, జిల్లాలోని మొత్తం 469-గ్రామ పంచాయతీలలో అభివృద్ధికి ప్రత్యేక నిధులు రూ.15 లక్షలు ప్రకటించారు. మెదక్‌లో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయం, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని కూడా కేసీఆర్ ప్రారంభించారు. తక్కువ కాలంలోనే తెలంగాణ గణనీయమైన అభివృద్ధిని సాధించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు.