కాస్త ఓపిక పట్టండి..ప్రజలు 15 ఏళ్లు మనకే పట్టం కడతారు: కేసీఆర్

ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జెడ్పీ చైర్పర్సన్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

By Srikanth Gundamalla  Published on  3 July 2024 3:15 AM GMT
brs,  kcr, meeting,  Telangana, politics,

కాస్త ఓపిక పట్టండి..ప్రజలు 15 ఏళ్లు మనకే పట్టం కడతారు: కేసీఆర్

ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జెడ్పీ చైర్పర్సన్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక కామెంట్స్ చేశారు. తెలంగాణలో ప్రజలు మళ్లీ బీఆర్ఎస్‌కే పట్టం కడుతారని చెప్పారు. పార్టీ నేతలు, కార్యకర్తలు సమన్వయంతో ఓపిక పట్టాలని అన్నారు. ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత 15 ఏళ్ల పాటు కొనసాగుతామని దీమాగా చెప్పారు కేసీఆర్ .మరో రెండేళ్లలో నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో మొత్తం నియోజకవర్గాల సంఖ్య 160కి పెరిగే అవకాశం ఉందని కేసీఆర్ అన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ నాయకులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. కొంచెం కష్టపడితే బీఆర్ఎస్‌కు మంచి ఫలితాలు వస్తాయన్నారు. సోషల్ మీడియా విభాగాన్ని పటిష్టం చేస్తామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పాలనను ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. ఒకసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. పిచ్చి పనులు చేస్తూ ప్రజలతో చీ కొట్టించుకోవడం ఆ పార్టీ వారికి అలవాటే అన్నారు. బీఆర్ఎస్‌ పదేళ్ల పాలనలో తెలంగాణలో అన్నీ సవ్యంగా ఉన్నాయని కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో కరెంటు, తాగునీటి సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. శాంతి భద్రతల సమస్య కూడా తలెత్తడం బాధాకరమని కేసీఆర్ అన్నారు.

బీఆర్ఎస్‌ను వీడిన నేతలను ఉద్దేశించి కేసీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. పార్టీలో ఉన్నప్పుడు పదవులను అనుభవించి.. నాలుగు రోజులు అది లేకపోయే సరికి ఉండలేకపోతున్నారా? అని ప్రశ్నించారు. ప్రజలే వారిని తిరస్కరిస్తారని చెప్పారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పనిచేస్తేనే రాజకీయ నాయకులకు మంచిదని చెప్పారు. మంచి యువ నాయకత్వాన్ని తాము తయారు చేస్తామని కేసీఆర్ చెప్పారు. బీఆర్ఎస్‌ ప్రభుత్వంలో గతంలో వైఎస్సార్‌ తెచ్చిన ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్‌మెంట్‌ వంటి పథకాలకు పేర్లు మార్చకుండా అమలు చేశామనీ.. ఇప్పుడు రకరకాల పేర్ల మార్పుతో పథకాలకు ఎగనామం పెట్టేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శలు చేశారు.

Next Story